- మంత్రివర్గంలో చోటుపై మాట తప్పిన చంద్రబాబు
- ఇద్దరు తమ్ముళ్లను మంత్రివర్గంలో ఉంచుకోవడం ఇష్టం లేని ఏపీ సీఎం
- హామీ ఇచ్చినా చోటు కల్పించడానికి టీడీపీ వర్గాల అయిష్టత
- అన్న కోసం పట్టుబడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే లోకేష్ కు నష్టమని భావిస్తున్నారు. ఇద్దరు మెగా బ్రదర్స్ మంత్రివర్గంలో ఉంటే రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. కాబట్టి నాగబాబుకు మంత్రి పదవి కాకుండా ఇంకేదైనా ఇచ్చేలా స్కెచ్ రచిస్తున్నట్లు సమాచారం.
ఏడాది పూర్తయిన చంద్రబాబు ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన వేళ మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ చర్చల మధ్య మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవిని నాగబాబుకు కట్టబెట్టాలనే చర్చ జరుగుతోంది. అయితే జనసేనలో సామాజిక సమీకరణాలు, పార్టీ బలం పెంచుకునే వ్యూహాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి.
సామాజిక సమీకరణాల గందరగోళం…
జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, నాగబాబుకు పదవి ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే ఆలోచన కూటమి నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన కూడా చర్చలో ఉంది. అయితే నాగబాబుకు పదవి ఇవ్వకపోతే జనసేన కార్యకర్తలు, మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన పార్టీలో ఉంది. ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే, ఆయనకు కీలక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని వినికిడి. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలనే ఒత్తిడి కూటమిలో ఉంది.