తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు పారదర్శకమైన పరిపాలనతో ముందుకు సాగుతామని, రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జపాన్ కితాక్యిషూ మేయర్ కజుహిసా టక్యూచీ రాష్ట్ర అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ రైజింగ్ 2047… భవిష్యత్తు ప్రణాళిక
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. “దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం” అని ఆయన వివరించారు.

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆయన గుర్తు చేశారు. “జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలాం. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకు వెళుతున్నాం” అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి… లక్ష్యాలు
ప్రజా ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ప్రధానంగా మహిళలు, రైతులు, యువత, విద్య, వైద్య రంగాల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వంటి కీలక నిర్ణయాలను వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ పునరుజ్జీవం పథకం, భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలు, విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది ప్రముఖులకు ముఖ్యమంత్రి గారు పురస్కారాలను అందించారు. అలాగే, వివిధ కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు గ్యాలంటరీ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *