- అందాల మెడికో… అందమైన ప్రయోగం
- మిస్ వరల్డ్ లో పాల్గొన్న డాక్టర్ సంస్థ ఇది
- యునైటెడ్ కింగ్డమ్ లో డాక్టర్ల ప్రయోగం
- యువతకు ప్రాథమిక చికిత్సలో అవగాహన
- కత్తిపోట్లు, గాయాల పాలైన వారికి సాయం
- ‘సహనం వందే-ఆర్టికల్ టుడే’లతో అందాల తార మిల్లీ-మే
సహనం వందే, హైదరాబాద్:
ఈమె పేరు మిల్లీ-మే ఆడమ్స్. యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ కు చెందిన మెడికల్ స్టూడెంట్. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బ్రిటన్ లో అందాల పోటీల్లో ఆమె గతంలో విజయం సాధించారు. ఈ యువ డాక్టర్ అందాల పోటీలోనే కాదు… ఒక మెడికోగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్ట్రీట్ డాక్టర్స్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 2008లో వైద్య విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థ… దేశవ్యాప్తంగా 19 నగరాల్లో విస్తరించి... వందలాది మంది వాలంటీర్ల సహకారంతో పని చేస్తోంది. 11 నుంచి 25 ఏళ్ల వయస్సున్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా, వారు ఎదుర్కొనే హింసాత్మక సంఘటనలకు తగిన విధంగా తక్షణమే స్పందించేలా స్ట్రీట్ డాక్టర్స్ కృషి చేస్తున్నారు.
కత్తిపోట్లు… నేరాలతో గాయాలు
యునైటెడ్ కింగ్డమ్‌లో ఇటీవల కత్తి దాడులు, యువత హింసాకాండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ‘స్ట్రీట్‌డాక్టర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యువతలో చైతన్యం పెంపొందించేందుకు కీలకంగా పనిచేస్తోంది. ప్రథమ చికిత్సా శిక్షణను అందిస్తూ ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో నేర్పుతూ ఎన్నో జీవితాలను రక్షిస్తోంది. వైద్య శిక్షణతో ప్రాణాలను రక్షిస్తున్నారు. స్ట్రీట్‌డాక్టర్స్ ప్రధానంగా మూడు కార్యక్రమాలను అమలు చేస్తోంది.
- ‘రిడ్యూసింగ్ వైలెన్స్’ కార్యక్రమం ద్వారా, యువతకు రక్తస్రావం ఎలా ఆపాలి, స్పృహ కోల్పోయినవారికి ఏం చేయాలి వంటి ప్రాథమిక వైద్య శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణ స్కూళ్లు, యూత్ క్లబ్‌లు, కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.
- ‘స్టెప్‌వైజ్’ అనే కోర్సు ద్వారా యువతలో ఆరోగ్యపు అవగాహనతో పాటు, కమ్యూనిటీ భద్రతపై చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు.
- ‘యంగ్ లీడర్స్ ప్రోగ్రాం’ ద్వారా ఈ శిక్షణను పూర్తిచేసిన యువతనే తిరిగి ఇతరులకు శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నారు.
2024లో ఈ సంస్థ 13,500 మంది శిక్షణ… 2024లో ఈ సంస్థ 13,500 మంది యువతకు శిక్షణ అందించింది. 2022లో ఇది 5,000 మందికే పరిమితమై ఉండగా ఇప్పుడు మరింత అభివృద్ధి చెందింది. అంటే ఏడేళ్లలో మూడింతలు పెరిగింది. స్ట్రీట్ డాక్టర్స్ వల్ల అనేకమంది ప్రాణాలు నిలబడ్డాయి. 15 ఏళ్ల టామీ అనే బాలుడు తన స్నేహితుడు కత్తిపోటుకు గురైన సమయంలో, స్ట్రీట్‌డాక్టర్స్ శిక్షణతో నేర్చుకున్న నైపుణ్యాలను వినియోగించి రక్తస్రావాన్ని ఆపాడు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి సకాలంలో చికిత్సకు సహాయపడ్డాడు.
డిజిటల్ శిక్షణ… స్ట్రీట్‌డ్ర్స్ యాప్
2022లో ప్రారంభించిన ‘స్ట్రీట్‌డ్ర్స్’ యాప్ ద్వారా యువత మొబైల్ ఫోన్‌లోనే ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందే అవకాశం కలుగుతోంది. గ్రేటర్ మాంచెస్టర్, మెర్సీసైడ్ వంటి ప్రాంతాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. హింసాత్మక ఘటనలతో సంబంధమున్న యువ నేరస్థుల పునరావాస కేంద్రాల్లో కూడా ఈ యాప్ ఉపయోగంలో ఉంది.క్రాయిడన్, సౌతాంప్టన్ వంటి ప్రాంతాల్లో స్థానిక కమ్యూనిటీ సంస్థలతో కలిసి పనిచేస్తూ డిజిటల్ శిక్షణ అందిస్తున్నారు. 2021లో క్రాయిడన్‌లో 100 మందికి శిక్షణ ఇచ్చారు. ఇదే ప్రాంతంలో 2020లో 73 మంది కత్తి దాడుల్లో మరణించారు. ఇలాంటి గణాంకాల మధ్య ఈ సంస్థ యువతను రక్షించే ప్రయత్నాల్లో ముందుండటం గమనార్హం. మెర్సీసైడ్‌లో 2023లో స్ట్రీట్‌డాక్టర్స్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా 113 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇది హింస నియంత్రణలో కీలకంగా నిలిచిన ఉదాహరణ.
అవార్డులతో గుర్తింపు
2023లో స్ట్రీట్‌డాక్టర్స్ సంస్థకు యూకేలో ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో విశేష సేవలందించిన సంస్థలకిచ్చే జీఎస్ కే ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. ఈ పురస్కారంతో పాటు 40,000 పౌండ్ల నిధులు, నాయకత్వాభివృద్ధికి సాయం లభించింది. లండన్, మాంచెస్టర్ వంటి నగరాల్లో నేషనల్ లాటరీ నిధుల (రూ. 2.3 కోట్ల మేర) మద్దతుతో యువతకు శిక్షణ ఇచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
మిస్సవరల్డ్ పోటీలో మెడికో మిల్లీ-మే…
మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న మిల్లీ-మే, స్ట్రీట్‌డాక్టర్స్ ప్రచారానికి కీలకంగా ఉన్నారు. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేస్తోన్న ప్రచారం వల్ల, ఈ సంస్థ కార్యక్రమాలకు మరింత గుర్తింపు లభిస్తోంది. కత్తి పోట్లు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు యువత చేతిలో సాధనంగా స్ట్రీట్‌డాక్టర్స్ పని చేస్తున్నది. ప్రమాద సమయంలో భయపడకుండా స్పందించగల నైపుణ్యం, సామాజిక బాధ్యత, ప్రాణాల విలువపై అవగాహన కలిగించే విధంగా ఈ సంస్థ తన పని చేస్తుందని స్ట్రీట్ డాక్టర్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొన్న డాక్టర్ మిల్లీ-మే ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ డిజిటల్ మీడియాలకు వివరించారు. ప్రతి వీధిలో అలాంటి శిక్షణ పొందిన యువకుడు లేదా యువతి ఉంటే, కేవలం హింసే కాదు, అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టే విధంగా అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.