‘దివాళా’కోరు చట్టం – 10 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము దోపిడీ

Industralists Bank Loans
  • ప్రజా సొమ్ముతో బడా బాబుల పండుగ
  • దివాళా చట్టం అట్టర్ ప్లాప్… కార్పొరేట్ల షోకు
  • కంపెనీలను తక్కువకు కొంటున్న బడాలు
  • ఆ రకంగా బ్యాంకుల సొమ్ము బడాల పాలు
  • ప్రజల సొమ్మును పంచి పెడుతున్న బ్యాంకర్లు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో దివాళా చట్టం ఒక వింత యంత్రంలా మారింది. కంపెనీలను కాపాడాల్సిన ఈ చట్టం.. బడా పారిశ్రామికవేత్తలకు ఆస్తులను దోచిపెట్టే సాధనంగా మారింది. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తుంటే అవే కంపెనీలను అత్యంత తక్కువ ధరకు కొట్టేస్తూ కొద్దిమంది ధనవంతులు మరింత బలపడుతున్నారు. ప్రజా ధనాన్ని బలిపీఠం మీద పెడుతూ జరుగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం.

Indian Banks losses  above  10 Lakh Crores

పది లక్షల కోట్ల భారీ గండి
దేశంలోని బ్యాంకులు ఈ దివాళా చట్టం వల్ల ఇప్పటివరకు ఏకంగా 10,00,000 కోట్లకు పైగా నష్టపోయాయి. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 32 శాతం మాత్రమే తిరిగి వసూలు అయ్యాయి. అంటే మిగిలిన 68 శాతం సొమ్మును బ్యాంకులు వదులుకోవాల్సి వచ్చింది. ఒక కంపెనీకి లక్ష కోట్లు అప్పు ఉంటే దాన్ని పరిష్కరించే పేరుతో 68 వేల కోట్లు మాఫీ చేస్తూ మిగిలిన మొత్తానికే వేరొకరికి కట్టబెడుతున్నారు. ఈ భారీ నష్టాన్ని చివరకు పన్ను చెల్లింపుదారులే భరించాల్సి వస్తోంది.

వీడియోకాన్ కేసులో వింత దోపిడీ
అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం వీడియోకాన్ గ్రూప్ వ్యవహారం. ఈ కంపెనీ బ్యాంకులకు 64,000 కోట్లు బాకీ పడింది. కానీ దివాళా తీర్మానం పేరుతో దీనిని కేవలం 3,000 కోట్లకు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ దక్కించుకుంది. అంటే బ్యాంకులు ఏకంగా 95 శాతం నష్టాన్ని భరించాయి. వంద రూపాయల అప్పులో కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేసుకుని వేల కోట్ల విలువైన కంపెనీని వేదాంత గ్రూప్‌నకు అప్పగించాయి. ఇది పారిశ్రామిక రంగంలో జరిగిన పెను వింత.

Bank Losses with Industries Loans

రిలయన్స్ చేతికి అలోక్ ఇండస్ట్రీస్
మరో కీలక ఉదాహరణ అలోక్ ఇండస్ట్రీస్ కథ. ఈ కంపెనీ బ్యాంకులకు 30,000 కోట్లు అప్పు పడింది. దీనిని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 5,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక్కడ బ్యాంకులు 83 శాతం నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఇలాంటి ఒప్పందాల వల్ల బ్యాంకులు ఖాళీ అవుతున్నాయి. కానీ బడా పారిశ్రామికవేత్తలు మాత్రం చిల్లర ధరకే భారీ కంపెనీలను తమ సామ్రాజ్యంలో చేర్చుకుంటూ మార్కెట్‌ను శాసిస్తున్నారు.

టాటా వశమైన భూషణ్ స్టీల్…
భూషణ్ స్టీల్ కంపెనీ బ్యాంకులకు 56,000 కోట్లు బాకీ ఉండగా… టాటా స్టీల్ దీనిని 35,000 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడ కొంత మొత్తం వసూలు అయినట్లు కనిపిస్తున్నా ఆ కంపెనీకున్న అసలు ఆస్తుల విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇలాంటి పెద్ద కేసులన్నీ దేశంలోని టాప్ 5 లేదా 10 పారిశ్రామిక గ్రూపులకే దక్కుతున్నాయి. దీనివల్ల దేశ సంపద అంతా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. ఇది ఆరోగ్యకరమైన పోటీని దెబ్బతీస్తోంది.

కలర్ స్టీల్ ఆస్తులు జిందాల్ పాలు
జేఎస్ డబ్ల్యూ స్టీల్ కంపెనీ కూడా ఈ దివాళా చట్టాన్ని అద్భుతంగా వాడుకుంది. సుమారు 12,000 కోట్లు బాకీ ఉన్న భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీని కేవలం 1,500 కోట్లకు జిందాల్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా బ్యాంకులు భారీగా నష్టపోయాయి. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో బడా గ్రూప్ చేతిలోకి వెళ్తోంది. అప్పులు కట్టని యజమానుల నుంచి కంపెనీలను లాక్కుని వాటిని మళ్ళీ తక్కువ ధరకే మరో బడా బాబుకు అప్పగించడం ఈ చట్టం పనిగా మారిపోయింది.

డిజిటల్ కనెక్టివిటీకి అల్ట్రాటెక్ దెబ్బ
బినాని సిమెంట్ కేసులో కూడా ఇదే తంతు జరిగింది. ఈ కంపెనీని అల్ట్రాటెక్ సిమెంట్ సుమారు 8,000 కోట్లకు కైవసం చేసుకుంది. ఇలా సిమెంట్, స్టీల్, టెలికాం వంటి కీలక రంగాలు ఇప్పుడు కొద్దిమంది పారిశ్రామికవేత్తల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. చిన్న కంపెనీలు కనుమరుగవుతుంటే ఉన్న ఆస్తులన్నీ బడా శక్తుల పరమవుతున్నాయి.

పతనం అవుతున్న రికవరీ రేటు
మొదట్లో ఈ చట్టం బాగానే పనిచేస్తుందని అందరూ నమ్మారు. కానీ కాలం గడిచేకొద్దీ అప్పుల వసూలు దారుణంగా పడిపోతోంది. 2018లో వసూళ్ల రేటు 50 శాతానికి పైగా ఉండగా ఇప్పుడు అది 25 శాతానికి పడిపోయింది. అంటే కంపెనీలను పరిష్కరించడంలో కావాలనే జాప్యం చేస్తూ, వాటి విలువను పూర్తిగా తగ్గించి చివరకు అగ్గువకే అమ్ముతున్నారు. ఈ కాలయాపన వల్ల యంత్రాలు, ఆస్తులు పాడైపోయి వేలం వేసే సమయానికి కంపెనీ విలువ శూన్యమవుతోంది.

న్యాయ వ్యవస్థలో తీరని జాప్యం
కంపెనీలను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యం కూడా బడాబాబులకు వరంగా మారింది. చట్టం ప్రకారం 330 రోజుల్లో కేసు తేలాలి. కానీ సగటున ఒక కేసు పరిష్కారానికి 600 రోజులకు పైగా పడుతోంది. సమయం గడిచేకొద్దీ ఆ కంపెనీ ఆస్తుల విలువ పడిపోతుంది. ఆ సమయం చూసి బడా పారిశ్రామికవేత్తలు నామమాత్రపు ధరలకు బిడ్డింగ్ వేస్తున్నారు. ఈ వ్యవస్థాగత లోపాల వల్ల బ్యాంకులు ఖాళీ అవుతున్నాయి, కార్పొరేట్ తిమింగలాలు మాత్రం కొవ్వు పడుతున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *