- తక్కువ ఖర్చుతో ఆరంభం… కొత్త పెట్టుబడి
- స్మార్ట్ ఫోన్లో నెంబరే మన డిజిటల్ బంగారం
- లాకర్ల గోల ఇక ఉండదు… భద్రతకు గ్యారెంటీ
సహనం వందే, హైదరాబాద్:
బంగారం అంటే కేవలం బీరువాలో దాచుకునే నగలే కాదు. అదిప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఒక అంకె మాత్రమే. వేల రూపాయలు ఉంటేనే బంగారం కొనాలనే నిబంధనలు ఇప్పుడు మారిపోయాయి. కేవలం 1 రూపాయికే 99.9 శాతం స్వచ్ఛమైన పసిడిని మీ జేబులో ఉంచుకోవచ్చు. ఇదే డిజిటల్ గోల్డ్ విప్లవం. మీ అరచేతిలోనే అక్షయ పాత్రలా ఇది కనిపిస్తోంది.
ఆన్‌లైన్ బంగారం గుట్టు
డిజిటల్ గోల్డ్ అంటే మీరు భౌతిక బంగారం కొన్నట్లే లెక్క. కాకపోతే అది మీ దగ్గర కాకుండా విక్రేత వద్దే ఉంటుంది. మీరు యాప్ ద్వారా 100 రూపాయల బంగారం కొంటే ఆ విలువైన ముక్కను ఒక లాకర్‌లో భద్రపరుస్తారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ రేటుకు అమ్ముకోవచ్చు. లేదా అది ఒక తులం అయిన తర్వాత నాణెం రూపంలో మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. గాలిలో చేసే వ్యాపారం కాదిది. మీరు కొనే ప్రతి మిల్లీ గ్రాముకు వెనుక భౌతికమైన నిల్వ ఉంటుంది.

ఎక్కడ కొనాలి? ఎవరు బాధ్యులు?
ప్రస్తుతం ఇండియాలో సేఫ్‌గోల్డ్, ఎంఎంటీసీ-పీఏఎంపీ వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను విక్రయిస్తున్నాయి. మీరు గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి… ఈ యాప్‌లు కేవలం మధ్యవర్తులు మాత్రమే. మీ బంగారం భద్రతకు బాధ్యత వహించేది అసలు విక్రయ సంస్థలు, వారు నియమించిన ట్రస్టీలు మాత్రమే.
నమ్మకానికి గ్యారెంటీ ఏంటి?
మీరు ఒక గ్రాము బంగారం కొన్నారనుకోండి… దానికి సమానమైన 24 క్యారెట్ల ఫిజికల్ గోల్డ్ వాల్ట్‌లో భద్రంగా ఉందో లేదో ఐడీబీఐ వంటి స్వతంత్ర ట్రస్టీలు పర్యవేక్షిస్తాయి. ఒకవేళ విక్రయ సంస్థకు ఏదైనా సమస్య ఎదురైనా ట్రస్టీ దగ్గర ఉన్న మీ బంగారం సురక్షితంగా ఉంటుంది. అంటే మీరు కొనే ప్రతి మిల్లీ గ్రాముకు వెనుక భౌతికమైన బంగారం నిల్వ ఉంటుంది. ఇది గాలిలో చేసే వ్యాపారం కాదు.
అనుమానాల మధ్య అసలు అవసరమా?
ఫిజికల్ గోల్డ్ కొంటే తరుగు, మజూరీ పేరుతో 10 నుంచి 20 శాతం వరకు నష్టపోవాలి. కానీ డిజిటల్ గోల్డ్‌లో మీరు 100 రూపాయల బంగారం కొన్నా అది 100 రూపాయల విలువైన స్వచ్ఛమైన బంగారంగానే ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒకేసారి లక్ష రూపాయలు పెట్టి గోల్డ్ బిస్కెట్ కొనలేకపోవచ్చు. కానీ రోజుకు 100 రూపాయల చొప్పున డిజిటల్ రూపంలో కొంటూ వెళ్తే అది భారంగా అనిపించదు.
నిర్వహణ బాధ్యతలు ఎవరివి?
మీ బంగారం భద్రత బాధ్యతను బ్రింక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సెక్యూరిటీ సంస్థలు చూస్తాయి. వీరు అత్యంత సురక్షితమైన వాల్ట్లలో మీ బంగారాన్ని దాచి ఉంచుతారు. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అంటే అగ్ని ప్రమాదం లేదా దొంగతనం జరిగినా మీ పెట్టుబడికి నష్టం జరగదు. ఈ వ్యవస్థ అంతా ఆడిటర్ల ద్వారా నిరంతరం తనిఖీ చేస్తారు. అందుకే దీనిని నమ్మవచ్చు.
నగదుగా మార్చుకోవడం సులభమా
చాలామందికి ఉండే భయం.. అత్యవసర సమయాల్లో ఇది పనికొస్తుందా అని. భౌతిక బంగారాన్ని అమ్మాలంటే మీరు దుకాణానికి వెళ్లాలి… వారు ఇచ్చే రేటుకు ఒప్పుకోవాలి. కానీ డిజిటల్ గోల్డ్‌ను మీరు ఉన్న చోటు నుంచే సెకన్ల వ్యవధిలో అమ్మేయవచ్చు. ఆ డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాకు వస్తుంది. ఎటువంటి తరుగు ఉండదు. పారదర్శకమైన ధర మీ సొంతం అవుతుంది.
పెట్టుబడిదారులకు మేలు చేసేలా?
ప్రస్తుతం దీనికి నియంత్రణ సంస్థ లేకపోయినా పారదర్శకత కారణంగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనేవారికి ఇది సరైన మార్గం. ఎందుకంటే ఇక్కడ భద్రత ఖర్చు లేదు. కల్తీ భయం లేదు. అయితే డిజిటల్ బంగారం కొనేటప్పుడు అందులో నిపుణులైన వారిని సంప్రదించి సరైన జాగ్రత్తతో తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇది మార్కెట్లోకి వస్తున్నందున ఇందులో ఉండే మంచి చెడులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.