బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు

Bishnoi Cricket Match Fixing
  • క్రికెట్ పిచ్‌పై మాఫియా నీడలు
  • కెనడా క్రికెట్‌లో రక్త చరిత్ర
  • రెస్టారెంట్‌లో ప్లేయర్లకు మరణ శాసనం
  • అరవిందర్ ఖోసాపై సంచలన ఆరోపణలు

సహనం వందే, కెనడా:

అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…
నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది. ఒక ప్రాంతీయ టోర్నీ విజయం తర్వాత 25 మంది క్రికెటర్లు భోజనానికి వెళ్లగా అక్కడకు బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులు ప్రవేశించారు. కెనడా జాతీయ స్టార్ ఆటగాడిని నేరుగా బెదిరిస్తూ దిల్‌ప్రీత్ బాజ్వాకు మద్దతు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. గ్యాంగ్‌స్టర్ల ప్రమేయంతో క్రికెటర్ల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి.

Bishnoi World Cup Match Fixing with Canada

నోహ్‌కు అందిన గ్యాంగ్ మెసేజ్
ముఠా ఆగడాలు అంతటితో ఆగలేదు. నోహ్ అనే వ్యక్తిని లొంగదీసుకోవడానికి బిష్ణోయ్ గ్యాంగ్ నేరుగా ఫోటో సందేశాలను పంపింది. జట్టు ఎంపికలో తమకు అనుకూలమైన వ్యక్తులు ఉండేలా చూసేందుకు ఏకంగా క్రికెట్ పరిపాలననే శాసించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లను భయభ్రాంతులకు గురిచేసి తమకు కావాల్సిన వారిని జట్టులోకి జొప్పించడమే ఈ ముఠా ప్రధాన ఎజెండాగా మారింది.

దిల్‌ప్రీత్ బాజ్వా నియామకం మిస్టరీ
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని వారాల ముందే దిల్‌ప్రీత్ బాజ్వాకు కెప్టెన్సీ పగ్గాలు దక్కడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అసలు అర్హత లేకపోయినా బిష్ణోయ్ గ్యాంగ్ ఒత్తిడితోనే అతడిని కెప్టెన్‌గా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియామకం ద్వారా ముఠా మొత్తం జట్టును తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని బుకీల కనుసన్నల్లో మ్యాచ్‌లను నడిపించింది.

న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ స్కెచ్…
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫిక్సింగ్ వ్యూహం బహిర్గతమైంది. కెప్టెన్ బాజ్వా వేసిన ఒక ఓవర్ అత్యంత ఖరీదైనదిగా అసాధారణంగా ఉండటంతో ఐసీసీ అధికారులకు అనుమానం వచ్చింది. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రన్స్ సమర్పించుకున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో అధికారులు బాజ్వా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

బోర్డు ప్రెసిడెంట్ పాత్రపై విచారణ…
క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసా పేరు ఈ కుంభకోణంలో ప్రధానంగా వినిపిస్తోంది. ఖోసా పదవిలోకి రాకముందే బాజ్వాను కెప్టెన్ చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్లతో చేతులు కలిపి మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు దండుకోవడమే వీరి లక్ష్యమని నివేదికలు చెబుతున్నాయి. బోర్డు అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపైనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

కుట్రలను కొట్టిపారేసిన ఖోసా…
ఈ ఆరోపణలను ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా తనను పదవి నుంచి తప్పించడానికి జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తున్నారు. కానీ ఐసీసీ ఏసీయూ అధికారులు మాత్రం బాజ్వా ఫోన్ డేటా ఆధారంగా ముఠా నాయకులతో జరిగిన సంభాషణలను వెలికితీస్తున్నారు. క్రికెట్ మైదానంలో పరుగుల కంటే నేర సామ్రాజ్యపు ఎత్తుగడలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *