- యూపీ వాటా 14% నుండి 16% పెరుగుదల
- తమిళనాడు వాటా 7% నుంచి 5% తగ్గుదల
- ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోనూ వాటాకు వాత
- ఉత్తరాది విస్తరణ… దక్షిణాది విస్మరణ!
- సీట్ల పెంపు కుట్ర… సమాఖ్య వ్యవస్థ విచ్ఛిన్నం
- దేశ రాజధానిలో ఉత్తరాది గుత్తాధిపత్యం
సహనం వందే, హైదరాబాద్:
దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం భారత ప్రజాస్వామ్యానికి కొత్త చిరునామాగా మారుతుందా లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే రాజకీయ ఆయుధంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన పేరిట సాగుతున్న ఈ పరిణామం దేశంలో రెండు ప్రాంతాల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం నెలకొంది. సంఖ్యల మాటున దాగి ఉన్న ఈ వ్యూహం భవిష్యత్తు భారతాన్ని శాసించబోతోంది.
అంకెల్లో దాగిన అసలైన అన్యాయం
అవినాష్ ఎం త్రిపాఠి అంచనాల ప్రకారం సీట్ల పెంపుదల తర్వాత లోకసభ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత వాటా 14.73 శాతంగా ఉంటే అది భవిష్యత్తులో 16.44 శాతానికి పెరగనుంది. బీహార్ వాటా కూడా 7.36 శాతం నుండి 8.58 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే జనాభా విస్ఫోటనాన్ని అరికట్టని రాష్ట్రాలకు అదనపు బహుమతులు దక్కుతుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించిన రాష్ట్రాలకు మాత్రం శిక్ష తప్పడం లేదు.

దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ముప్పు
సీట్ల విస్తరణలో తమిళనాడు అత్యంత దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం 7.18 శాతంగా ఉన్న తమిళనాడు ప్రాతినిధ్యం 5.88 శాతానికి పడిపోనుంది. ఆంధ్రప్రదేశ్ వాటా 4.6 శాతం నుండి 4.04 శాతానికి తగ్గుతుంది. కర్ణాటక సైతం 5.15 శాతం నుండి 5.03 శాతానికి పడిపోనుంది. ఈ గణాంకాలు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను నామమాత్రం చేస్తాయి. కేంద్రంలో ఎవరు చక్రం తిప్పాలో కేవలం ఉత్తరాది ఓట్లే నిర్ణయించే పరిస్థితి రాబోతోంది.
విజయవంతమైన నియంత్రణకు వింత శిక్ష
దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు విద్య, వైద్య రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించాయి. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఇవి దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అయితే 1971 నాటి జనాభా లెక్కల స్థానంలో కొత్త గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాజకీయంగా బలహీనపడుతుంది. దేశానికి వెన్నెముకగా నిలిచి భారీగా పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాలు తమ సొంత నిర్ణయాల్లోనే గళం విప్పలేని దుస్థితి ఏర్పడుతోంది. నిధుల కేటాయింపులో కూడా ఇప్పటికే వివక్ష మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్య విలువలకు కొత్త సవాలు
ప్రస్తుతం లోకసభలో 543 సీట్లు ఉండగా కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది కూర్చునే సౌకర్యం ఉంది. అంటే మొత్తం సీట్ల సంఖ్య 848కి చేరవచ్చని అంచనా. మహారాష్ట్ర ప్రస్తుత వాటా 8.83 శాతం నుండి 9.2 శాతానికి పెరగనుంది. కానీ పశ్చిమ బెంగాల్ వాటా 7.73 శాతం నుండి 7.48 శాతానికి తగ్గుతోంది. ఈ మార్పులు కేవలం సంఖ్యాపరమైనవి మాత్రమే కావు. ఇవి దేశ సమగ్రతను, ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదముంది.
సమాఖ్య వ్యవస్థపై గొడ్డలిపెట్టు
కేవలం రెండు మూడు ఉత్తరాది రాష్ట్రాలు తలచుకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గి జాతీయ పార్టీల ఏకపక్ష పాలన సాగుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ వంటి ప్రాంతాలు జాతీయ విధాన నిర్ణయాల్లో తమ ప్రాముఖ్యతను కోల్పోతాయి. జనాభా పెంచడమే రాజకీయ బలానికి సూత్రమైతే అభివృద్ధి చెందిన రాష్ట్రాల ఆత్మగౌరవం ఏం కావాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది రాజ్యాంగ నైతికతను పరీక్షించే సమయం.
రాజకీయ విభజన రేఖలు
ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ విస్తరణ పర్వం చివరకు దేశాన్ని ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అగాధాన్ని పెంచేలా కనిపిస్తుంది. జనాభా విస్ఫోటనాన్ని రాజకీయ బలంగా మార్చుకోవడం సామాజిక న్యాయం కాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. కొత్త పార్లమెంటులోని 888 సీట్లు కేవలం ఖాళీ కుర్చీలు కావు. అవి భవిష్యత్తులో దేశ అధికార కేంద్రం ఎక్కడ ఉండాలో నిర్ణయించే శక్తులు. ఈ పరిణామాల మధ్య దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే ఇప్పుడున్న అతిపెద్ద సవాలు.