- ఆల్కహాల్‌తో అదిరిపోయే ప్రయాణం
- కిక్కు పెంచే కారు… మద్యంతో జోరు
- బంకుల్లో మందుతో కూడిన ఇంధనం
- కాలుష్యానికి భారీ చెక్… సరికొత్త ఇంజన్ల వేట
సహనం వందే, హైదరాబాద్:
పెట్రోలు బంకుల్లో ఇకపై వాహనాలకు మందు పార్టీ జరగబోతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ట్యాంకు ఫుల్ చేస్తే కారు తూలుతుందో లేదో తెలియదు కానీ మీ జేబుకు మాత్రం ఉపశమనం లభిస్తుంది. అరబ్ దేశాల యుద్ధాల మధ్య భారత్ తన సొంత దారిని వెతుక్కుంటూ మద్యం వైపు అడుగులేస్తోంది.
కారుకు మత్తు కిక్కు
భారత ప్రభుత్వం త్వరలోనే ఈ85 ఇంధనాన్ని తీసుకురాబోతోంది. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోలు ఉంటుంది. ఇది అచ్చంగా చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుండి తీసిన స్వచ్ఛమైన ఆల్కహాల్. ప్రభుత్వం దీని కోసం ముసాయిదా నిబంధనలను సిద్ధం చేస్తోంది. 2016లోనే ఈ ఆలోచన వచ్చినా ఇప్పుడు మధ్య ప్రాచ్య సంక్షోభం వల్ల దీనికి మోక్షం లభిస్తోంది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

వాహనాలపై ప్రాథమిక పరీక్షలు…
ఈ నిబంధనలు అతి త్వరలో నోటిఫై అవుతాయి. దీనిపై ప్రభుత్వం లోపల, మార్కెట్లో పూర్తి ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే వాహనాలపై ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశారు. అన్నీ సవ్యంగా జరిగితే మరో రెండు సంవత్సరాలలో ఈ85 ఇంధనం అందుబాటులోకి వస్తుంది. పెట్రోలు ధరల సెగ నుంచి సామాన్యుడిని రక్షించడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం కానుంది.
ప్రత్యేకమైన ఇంధన రకం
ప్రస్తుతం మనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నుండి ఈ20 పెట్రోలు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ85 అనేది దీనికి పూర్తి భిన్నమైనది. ఇందులో ఇథనాల్ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల పాత ఇంజన్లు దీనిని భరించలేవు. దీని కోసం ప్రత్యేకంగా తయారైన ఇంజన్లు మాత్రమే అవసరం. ఈ85 ఇంజన్లు ఉన్న వాహనాలు ఈ60 లేదా ఈ50 మిశ్రమంతో కూడా నడుస్తాయి. దీని కోసం బంకుల్లో ప్రత్యేక డిస్పెన్సింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలి.
మిగులు నిల్వల మాయాజాలం
భారతదేశం ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో మిగులు స్థితిలో ఉంది. అంతర్జాతీయ విమానయాన ఇంధనంలో కూడా 1 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. 2050 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది కీలక అడుగు. విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గించడమే కాకుండా దేశీయ రైతుల ఆదాయాన్ని పెంచడం దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్.
తయారీ వెనుక కథ
ఇథనాల్ అనేది పునరుత్పాదక శక్తి వనరు. దీనిని చెరకు, మొక్కజొన్న లేదా తృణధాన్యాల నుండి తయారు చేస్తారు. ఈ పంటలను గ్రైండింగ్ చేసి ఎంజైమ్ల సాయంతో పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తారు. ఆ తర్వాత ఈస్ట్ జోడించి పులియబెట్టడం ద్వారా ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తారు. చివరగా డిస్టిలేషన్ ప్రక్రియలో నీటిని తొలగించి 99 శాతం స్వచ్ఛమైన ఇంధనాన్ని వేరు చేస్తారు. ఇది పెట్రోలు కంటే స్వచ్ఛంగా మండుతుంది.
యుద్ధ భయాల పరిష్కారం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. విదేశీ దిగుమతులపై కోట్లాది రూపాయల ఖర్చు అవుతోంది. ఇథనాల్ వాడకం పెరిగితే కాలుష్యం తగ్గడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఈ85 అమలులోకి వస్తే వాహనదారులు తమ కారును మద్యం షాపులకు కాకుండా నేరుగా పెట్రోలు బంకులకే తీసుకువెళ్లి ఫుల్ చేయించుకోవచ్చు. ఇది పర్యావరణానికి, పర్సుకి కూడా లాభదాయకమైన మార్పు.