- శాకాహార భోజనం తయారీ ఖర్చు పెరుగుదల
- మాంసాహార భోజనమూ మరింత వ్యయం
- ఉల్లి, పప్పులు, గ్యాస్ ధరల ప్రభావం
- పండుగల వేళ మరింత పెరిగే అవకాశం
సహనం వందే, హైదరాబాద్:
ఇంట్లో వండుకుంటే ఖర్చు తగ్గుతుందని భావించే రోజులు పోయాయా? సామాన్యుడి వంట గదిపైనా ధరల భారం పడుతోంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, వంటగ్యాస్ ధరలు కలిసి భోజనాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చాయి. వెజ్ భోజనమే రూ. 30 దాటితే, నాన్‌వెజ్ రూ. 60కి చేరువైంది. పండుగల వేళ పరిస్థితి మరింత దారుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
క్రిసిల్ ఇన్టెలిజెన్స్ తాజా నివేదిక
క్రిసిల్ ఇన్టెలిజెన్స్ తాజా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2026లో ఇంట్లో ఒక మనిషికి సరిపడా ఒక పూట శాకాహార భోజనం తయారు చేయడానికి సగటున రూ. 30.8 ఖర్చు అవుతోంది. గతేడాది ఇదే సెప్టెంబర్ నెలలో రూ. 28.1 మాత్రమే ఖర్చు అయ్యేది. అంటే ఏడాది కిందటితో పోలిస్తే ఇప్పుడు రూ. 2.70 ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక మాంసాహార భోజనం విషయానికి వస్తే ప్రస్తుతం ఒక మనిషికి రూ. 59.5 ఖర్చు అవుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఖర్చు రూ. 56 ఉండేది. అంటే ఇప్పుడు రూ. 3.50 అదనంగా ఖర్చవుతోంది.

ఉల్లి ధరతో వంటగదిపై భారం
అయితే ఈ సాదాసీదా వెజిటేరియన్ భోజనం తయారీ ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం ఉల్లిపాయల ధరలు పెరగడమే. గతేడాది కిలో రూ. 28 ఉన్న ఉల్లిపాయ ధర, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 53 చేరింది. అంటే కిలోకు రూ. 25 అదనంగా భారం పడింది. ఉల్లిపాయలతో పాటు రోజూ వంటల్లో వాడే పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఇంధన ఖర్చు కూడా పెరిగింది. ఈ దినుసులు, గ్యాస్ ధరలు పెరగడం వల్లే వెజ్ భోజనం తయారీ వ్యయం రూ. 30 దాటిపోయింది.
వర్షాభావంతో ధరల మంట
వాతావరణ మార్పులు కూడా ఈ వంటగది బడ్జెట్‌ను దెబ్బతీశాయి. జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటల నాట్లు ఆలస్యమయ్యాయి. దీనివల్ల మార్కెట్‌కు కొత్త దిగుబడులు రాక ఉల్లి, కూరగాయల కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ఇక నాన్ వెజ్ భోజనం తయారీ ఖర్చులో ప్రధానంగా వాడే బ్రాయిలర్ కోడి మాంసం ధరలు మార్కెట్లో కొంతవరకు స్థిరంగా ఉన్నాయి. చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు రాకపోవడమే నాన్ వెజ్ భోజనం తయారీ ఖర్చు పెద్దగా మారకుండా ఉండటానికి కారణమైంది.
పండుగల వేళ మరింత భారమా?
ఈ లెక్కలను క్రిసిల్ సంస్థ ఒక ఇంట్లో ఆరుగురు ఉన్న కుటుంబానికి సరిపడా వంట చేసినప్పుడు ఒక ప్లేటు భోజనంలో ఉండే రొట్టె, బియ్యం, పప్పు, కూర, పెరుగు, సలాడ్ల దినుసుల ధరలను బట్టి వేస్తుంది. అలాగే నాన్ వెజ్ భోజనంలో పప్పు స్థానంలో చికెన్‌ను చేర్చి తయారీ వ్యయాన్ని లెక్కిస్తుంది. రాబోయే పండుగల సీజన్లో మార్కెట్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త పంటల దిగుబడి మార్కెట్‌కు పూర్తిస్థాయిలో వస్తే తప్ప ఈ నిత్యావసరాల ధరలు తగ్గేలా లేవు. అప్పటివరకు ఈ వంట ఖర్చులు సామాన్య కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.