స్టార్‌డమ్… సింగిల్ బెడ్ రూమ్ – కోట్ల ఆస్తి ఉన్నా నానా పటేకర్ సింపుల్ లైఫ్

Nana Patekar
  • షూటింగులకు 30 ఏళ్లు ఆటోలోనే ప్రయాణం
  • రైతుల కన్నీళ్లకు అండగా నిలిచిన నటుడు
  • సంపద కంటే మానవత్వానికే విలువ

సహనం వందే, మహారాష్ట్ర:

వందల కోట్ల ఆస్తిపాస్తులు, విలాసవంతమైన కార్లు కొనే స్తోమత ఉన్న ఒక సెలబ్రిటీ ఏళ్ల తరబడి ఆటోలోనే ప్రయాణించారంటే మీరు నమ్ముతారా? అసలు అంత పెద్ద స్టార్‌ అయి ఉండి, ఆడంబరాలకు దూరంగా సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో చాలా కాలం జీవించడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదంతా నిజం. సినీ రంగుల ప్రపంచంలో మెరిసిపోతూ కూడా నేలవిడిచి సాము చేయని నానా పాటేకర్ జీవన ప్రయాణం చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చాల్సిందే. ఆయన జీవన విధానం, స్ఫూర్తిదాయక ప్రయాణం వెనుక ఉన్న అసలు నిజాలేంటో చూద్దాం.

ఎదిగినా ఒదిగే స్వభావం
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క హిట్టు కొడితే చాలు చాలామంది స్టార్లకు కాళ్ల కింద భూమి కనిపించదు. విలాసవంతమైన బంగ్లాలు, కోట్ల విలువైన లగ్జరీ కార్ల కొనుగోలుతో సందడి చేస్తుంటారు. కానీ నానా పాటేకర్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడానికే ప్రాధాన్యమిచ్చారు. షూటింగ్‌లకు వెళ్లాలన్నా కేవలం ఆటోలోనే ప్రయాణించేవారు. ఎంతటి ప్రజాదరణ పొందినా, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా కూడా ఆయన లగ్జరీ కార్లను ఉపయోగించలేదు. వందల సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించినా ఒకే సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో చాలా కాలం ఉన్నారు. అప్పట్లో సినీ కళాకారుల కోసం ప్రభుత్వం కట్టించి ఇచ్చిన ఇంట్లోనే నివసించారు. ఈ నిరాడంబరత్వం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది.

కష్టాల నుంచి నటుడిగా ఎదుగుదల
తండ్రి మంచాన పడటంతో చిన్న వయసులోనే కుటుంబ భారం నానా పాటేకర్‌పై పడింది. సినిమా పోస్టర్లకు రంగులేస్తే వచ్చే డబ్బులతో ఒక పూట భోజనం, నాన్న మందుల అవసరాలు తీర్చేవారు. పదో తరగతి పూర్తి చేసి ఆర్ట్స్ లో డిప్లొమా చేసిన ఆయన బతుకుతెరువు కోసం నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. రంగస్థలంపై గుర్తింపుతో పాటు అప్పటి నటి స్మితా పాటిల్ సహకారంతో ‘ఆజ్ కీ ఆవాజ్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాలో రేప్ సీన్‌లో నటించాలని దర్శకుడు చెప్పగా తనకు అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని అక్కడి నుంచి వచ్చేశారు. ఆయన వ్యక్తిత్వం నచ్చి దర్శకుడు పిలిచి మరీ అదే సినిమాలో మరో పాత్ర ఇచ్చారు. అలా సినిమాల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ అత్యుత్తమ నటుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

నటనకు అంకితభావం.. రైతులకు అండ
వెండితెరపై ఆయన నటనకు జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ వంటి ఎన్నో గౌరవాలు దక్కాయి. కానీ అవేవీ తన జీవితానికి కొలమానం కాదని నానా పాటేకర్ భావించేవారు. సినిమాల్లో పాత్ర కోసం సైనిక శిక్షణ తీసుకుని కళ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించే కోపంతో కూడిన పాత్రల్లో ఆయన జీవించిన తీరు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఒకసారి రైతుల ఆత్మహత్యల వార్త విని నానా పాటేకర్ చలించిపోయారు. తన దగ్గరున్న డబ్బుతో కొన్ని కుటుంబాలనైనా నిలబెట్టాలని అనుకున్నారు. అప్పుల బాధతో సతమతమైన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. వారి అప్పులు తీర్చడానికి ఆర్థిక సాయం అందించారు. తన దగ్గరున్న డబ్బు అయిపోయే వరకు అలా ఇవ్వడానికి సిద్ధమేనని ఒక సందర్భంలో స్పష్టం చేశారు.

సంపద కంటే మానవత్వం
సినిమాల్లో ఎంతటి మహోన్నత పేరు తెచ్చుకున్నా ఆయన ఎప్పుడూ సాధారణ జీవితాన్నే కోరుకున్నారు. ఎంతటి వ్యక్తులైనా సరే తన ఇంటికి వస్తే ఆప్యాయంగా పలకరించేవారు. ఆడంబరాల కంటే పక్కన ఉన్న మనుషుల బాధలను పంచుకోవడమే నిజమైన జీవితమని ఆయన నమ్మేవారు. రూపాయి విలువ, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజానికే తిరిగి ఇచ్చారు. నటుడిగా ఒక తరం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నానా పాటేకర్, రీల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరోగా నిలిచారు. ఈ నటుడి ప్రయాణం తరతరాలకు ఒక గొప్ప మార్గదర్శి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *