ఫిడెల్… అమెరికా గుండెల్లో ధడేల్ – అగ్రరాజ్యాన్ని వణికించిన నాటి క్యూబా నేత

Fidel Castro - Trump
  • 634 సార్లు సీఐఏకే చుక్కలు చూపించిన వైనం
  • క్యాస్ట్రో వెంట్రుక పీకలేకపోయిన అమెరికా
  • 90 మైళ్ళ దూరం… అగ్రరాజ్యంలో భయం
  • వెనిజులా ఘటన తర్వాత రంకిలేస్తున్న ట్రంప్
  • ఇప్పటికీ క్యూబాను టచ్ చేసే దమ్ముందా?
  • క్యాస్ట్రో బతికుంటే వెనిజులా ఇంకోలా ఉండేది
  • క్యూబా నరనరాన చేగువేరా, క్యాస్ట్రో స్ఫూర్తి

సహనం వందే, హైదరాబాద్:

ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ ఇదే అమెరికా.. ఇదే సీఐఏ.. అదే సముద్రం అవతల క్యూబా అనే చిన్న దేశంలో మాత్రం ఒక మనిషి తలవెంట్రుకను కూడా పీకలేకపోయింది.. అతనే ఫిడెల్ క్యాస్ట్రో..!

తలవంచని యోధుడు…
అతను ఒక మనిషి కాదు.. ఒక తలవంచని సిద్ధాంతానికి నిలువెత్తు రూపం. ఫిడెల్‌ను చంపడానికి అమెరికా సీఐఏ 634 సార్లు ప్రయత్నించి విఫలమైందంటే అతను ఎలాంటి నాయకుడో అర్థం చేసుకోవచ్చు. బాంబులు వేసి అనేక దేశాలను కూల్చిన అమెరికా… ఇప్పటికీ క్యూబా భూభాగాన్ని మాత్రం టచ్ చేయలేకపోతోంది. ఎందుకంటే అక్కడ ఒక తుపాకీ కాదు.. ఒక విప్లవం రాజ్యమేలుతోంది. అందుకే బే ఆఫ్ పిగ్స్‌లో అమెరికా ఓడిపోయింది. ఫిడెల్ క్యాస్ట్రో ఉన్నప్పుడు అమెరికాకు ప్రణాళికలు ఉండేవి కానీ… విజయాలే ఉండేవి కావు.

క్యాస్ట్రో బతికి ఉంటే వెనిజులా ఇలా ఉండేదా?
క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సంవత్సరాలుగా ఆ దేశం డబ్బు, చమురు కోసం వెనెజులాపై ఆధారపడిందని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశానికి ఎలాంటి చమురు గానీ డబ్బు గానీ వెళ్లవని.. పరిస్థితి చేయి దాటిపోకముందే లొంగి పోవాలన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో.. క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ పైనా స్పందించారు. ఇది వినడానికి బాగుందన్నారు. అందుకే ప్రపంచాన్ని ఇప్పుడు ఒకే ప్రశ్న వేధిస్తోంది. ఒకవేళ ఫిడెల్ క్యాస్ట్రో ఇప్పుడు బతికి ఉంటే అమెరికా ఇంత దూరం వచ్చేదా? వెనిజులాలో ఇంత అల్లకల్లోలంగా ఉండేదా? అమెరికా ఇంత ధైర్యంగా ప్రపంచాన్ని తొక్కేదా?

సాహసమే ఊపిరిగా క్యాస్ట్రో విప్లవ ప్రస్థానం
క్యూబా అంటే ఒకప్పుడు అమెరికా కంపెనీల అడ్డా. పంచదార మిల్లుల నుంచి చమురు వరకు 70 శాతం ఆస్తి అమెరికా గుప్పిట్లోనే ఉండేది. బాటిస్టా అనే నియంత అండతో సాగుతున్న ఈ దోపిడీపై క్యాస్ట్రో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 1953లో మోంకాడా బారాక్స్‌పై జరిపిన దాడి విఫలమైనా ప్రజల్లో విప్లవ జ్వాలలు రగిలించింది. జైలు శిక్ష అనుభవించి వచ్చాక మెక్సికోలో సైన్యాన్ని సిద్ధం చేశారు. 1956లో గ్రాన్మా అనే చిన్న పడవలో 82 మందితో బయలుదేరితే కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఆ 12 మందే ఒక మహా సైన్యమై 1959లో హవానాను హస్తగతం చేసుకున్నారు. చేగువేరా, క్యాస్ట్రో ఇద్దరూ కలిసి క్యూబాను విప్లవ పథంలో నడిపించారు.

సీఐఏ కుట్రలను చిత్తు చేసిన ధీశాలి
క్యాస్ట్రోను అంతం చేసేందుకు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ చేయని ప్రయత్నం లేదు. క్యూబా గూఢచారి సంస్థల లెక్కల ప్రకారం ఏకంగా 634 సార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. విషపూరితమైన సిగార్లు, పేలిపోయే పెన్నులు, విషం కలిపిన మిల్క్ షేకులు, స్కూబా సూట్లు ఇలా రకరకాల పద్ధతుల్లో చంపాలని చూశారు. కానీ క్యాస్ట్రో అదృష్టం వైట్ హౌస్ గోడలను వణికించింది. బాంబులతో దేశాలను కూల్చిన అమెరికా ఒక మనిషి తలవెంట్రుకను కూడా పీకలేకపోయింది.

ఆరని విప్లవ జ్వాల క్యాస్ట్రో
ఫిడెల్ క్యాస్ట్రో అంటే కేవలం ఒక నాయకుడు కాదు ఒక నిరంతర విప్లవం. ఆఫ్రికా నుంచి ఆసియా వరకు ఎక్కడ విముక్తి పోరాటం జరిగినా క్యూబా అండగా నిలిచింది. 2016లో ఆయన 90 ఏళ్ల వయసులో మరణించినా ఆయన నాటిన ధైర్యం నేటికీ లాటిన్ అమెరికాను నడిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో క్యూబాను టచ్ చేసి దమ్ము అమెరికాకు ఉందా అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *