ఐదేళ్ల నరమేధం… వీడని భయం – వరంగల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ వ్యవహారం

Gorrelakunta Murders
  • అంతు చూసిన అక్రమ సంబంధం
  • 10 మందిని చంపేసిన హంతకుడు
  • కిరాతకం వెనుక అసలు కథ!

సహనం వందే, వరంగల్:

ఐదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను వణికించిన గొర్రెకుంట సీరియల్ కిల్లర్ వ్యవహారం ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక అక్రమ సంబంధంతో మొదలైన ఈ దారుణం పది మంది హత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 2020 మే నెలలో జరిగిన ఈ సామూహిక హత్యల ఘటన నేరం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. పోలీసుల చర్యలతో నేరస్తుడికి ఉరిశిక్ష పడినా ఆ 10 మంది అమాయకుల ప్రాణాలు తిరిగిరావు. ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్న ఆ కిరాతకుడి కుట్రను పరిశోధన కోణం నుంచి చూద్దాం.

ఆంటీతో మొదలైన పాడుపని!
2020 మార్చి నెలలో గొర్రెకుంటలోని గోనె సంచుల కర్మాగారంలో పనిచేసే బీహార్‌కు చెందిన 24 ఏళ్ల సంజయ్ కుమార్… అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 37 ఏళ్ల రఫీఖా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ బంధం చివరకు రఫీఖా కుమార్తెపై సంజయ్ లైంగిక దాడికి ప్రయత్నించే వరకు వెళ్లింది. దీంతో రఫీఖా తేరుకుని ఈ పాడుపని ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని… లేదా తనను పెళ్లి చేసుకోవాలని సంజయ్‌ను గట్టిగా హెచ్చరించింది. తన నేరం బయటపడుతుందనే భయంతో వణికిపోయిన సంజయ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్లే నెపంతో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు ప్రయాణంలో మజ్జిగ ప్యాకెట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెను స్పృహ కోల్పోయేలా చేసి చున్నీతో ఉరివేసి చంపేశాడు. అనంతరం ఆ శవాన్ని రైలు నుంచి బయటకు విసిరివేసి తప్పించుకున్నాడు.

నేరం దాచేందుకు నరమేధం…
రఫీఖా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంజయ్‌ను నిలదీయడం మొదలుపెట్టారు. బెంగాల్ వెళ్లిందని సంజయ్ అబద్ధం చెప్పినా వారిలో అనుమానం పెరిగింది. తన మొదటి హత్య వెలుగు చూసే ప్రమాదం ఉందని పసిగట్టిన సంజయ్ ఏకంగా ఆ కుటుంబాన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మే 20న మత్తుమందులు కొనుగోలు చేశాడు. అదే రోజు సాయంత్రం ఫ్యాక్టరీకి వెళ్లి తొమ్మిది మందికి ఆహారంలో మత్తు మందు కలిపాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత ఆ కిరాతకుడు తెల్లవారుజాము వరకు వారందరినీ గోనె సంచుల్లో కుక్కి కట్టి ఫ్యాక్టరీ పక్కనే ఉన్న మోటారు బావిలోకి విసిరేశాడు. ఒకేసారి తొమ్మిది ప్రాణాలు తీయడానికి ఆ కిరాతకుడి క్రూరత్వాన్ని చూసి పోలీసులే దిగ్భ్రాంతి చెందారు.

సీసీటీవీ దృశ్యాలే కీలకం…
మే 21న బావిలో అనుమానాస్పదంగా శవాలు కనిపించడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. సామూహిక హత్యగా తేలింది. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఏకంగా ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మొదట ఆత్మహత్యగా భావించినా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా సంజయ్ ఉనికిని… అతని అనుమానాస్పద కదలికలను గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా సామూహిక హత్యల కుట్రకు సంబంధించిన వివరాలను అంగీకరించాడు.

కిరాతకుడికి ఉరి
సంజయ్‌పై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 21 నుంచి కేవలం 40 రోజుల పాటు విచారణ జరిపిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు… ఆ కిరాతకుడికి ఉరిశిక్ష విధించింది. సమాజంలో ఇలాంటి అక్రమ సంబంధాలు… ఆ తర్వాత వాటిని దాచేందుకు జరిగే హత్యలు ఎంతటి అపాయకరమైనవో ఈ ఉదంతం స్పష్టం చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *