- దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన కేంద్రం
- బ్యాంకుల్లో ఎవరి సొమ్ము ఎవరికి లబ్ధి?
- బిలియనీర్లకు పంచిపెడుతున్న ఆర్బీఐ
- స్వయానా పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటన
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో బ్యాంకులు కేవలం కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు ఇస్తున్నాయి. అంతే కాదు వాళ్లు అప్పులు చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే వాటిని రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. వాటిని ఏకబిగిన రద్దు చేస్తుంది. తాజాగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పాత బకాయిలను రద్దు చేయడం దారుణం.

ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం?
దేశంలో బ్యాంకుల వ్యవహారాలు, అప్పుల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచే సింది. గత ఐదున్నర ఆర్థిక సంవత్సరాలలో అంటే 2025 సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ. 6,15,647 కోట్ల విలువైన రుణాలను రద్దు చేశాయట! ఈ సంచలన విషయాన్ని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ డేటా ద్వారా కేంద్రమే పార్లమెంటుకు తెలిపింది. ఇంత భారీ మొత్తంలో రుణాలు రద్దు చేశారంటే ఆ డబ్బు ఎవరిది? సామాన్య ప్రజలదా? పన్ను చెల్లింపుదారులదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదట మొండి బకాయిలుగా మారి నాలుగేళ్ల పాటు కేటాయింపులు చేసిన తర్వాతే రద్దు చేస్తారని ఆర్బీఐ చెబుతున్నా ఇంత పెద్ద మొత్తం అప్పు రద్దు కావడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి?
అప్పు రద్దు… అసలు వసూళ్లకు గ్యారెంటీ ఏది?
ఈ రుణాలను కేవలం రికార్డుల నుండి తొలగించినంత మాత్రాన అప్పు తీసుకున్నవారికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రద్దైపోదని ప్రభుత్వం చెబుతోంది. అంటే రద్దు చేసినా కూడా ఆ అప్పులను వసూలు చేసే పని నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. సివిల్ కోర్టులు, రుణ వసూలు ట్రిబ్యునల్స్, ఎస్ఏఆర్ఎఫఏఈఎస్ఐ చట్టం, దివాలా కోడ్ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వంటి అనేక మార్గాలలో బ్యాంకులు ఈ రుణాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయట. మరి ఆరు లక్షల కోట్ల అప్పును రద్దు చేసిన తర్వాత అందులో ఎంత శాతం తిరిగి వసూలు చేయగలరు? ప్రభుత్వ పెద్దలు, బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న పెద్ద మొత్తాల అప్పుల విషయంలో ఈ వసూళ్ల ప్రక్రియ ఎంత వేగంగా, నిజాయితీగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు.
సామాన్యుడిపై వడ్డీ పోటు!
ఈ పకడ్బందీ వసూళ్ల ప్రక్రియ ఒక పక్క నడుస్తుండగానే మరోవైపు సామాన్య రుణగ్రహీతలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. గృహ రుణం వంటి మారక వడ్డీ రేటు రుణాలు తీసుకున్నవారు తమ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే వడ్డీ రేటును తగ్గించమని బ్యాంకును అడగొచ్చట. ఆర్బీఐ విడుదల చేసిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు మూడు సంవత్సరాల గడువు కంటే ముందే వడ్డీ రేటులోని అదనపు రుసుము (స్ప్రెడ్)ను తగ్గించుకునే వెసులుబాటు వచ్చింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే— అప్పులు రద్దు చేసిన బడాబాబులను వదిలేసి సకాలంలో వాయిదాలు కడుతున్న సామాన్యుడికి క్రెడిట్ స్కోర్ ఆధారంగా అరకొర తగ్గింపులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఒకరికి ఆరు లక్షల కోట్ల మాఫీ, మరొకరికి వడ్డీలో కాస్త తగ్గింపు! ఇది ఏ రకమైన ఆర్థిక విధానం? ఈ ఆరు లక్షల కోట్ల అప్పు రద్దుపై కేంద్రం మరింత పారదర్శకతను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.