- కుల వ్యవస్థపై ఓ యువతి తిరుగుబాటు
- మహారాష్ట్రను కుదిపేసిన విషాద ప్రేమ ఘటన
- పరువు పేరుతో యువకుడిని బలిగొన్న దుస్థితి
సహనం వందే, మహారాష్ట్ర:
నారాయణీ నదీ తీరాన నగరమంతా నిద్రపోతున్న వేళ… నాందెడ్‌లో కులాంతర ప్రేమకు మరణశాసనం లిఖించారు. 25 ఏళ్ల సాక్షాం తేట్, 21 ఏళ్ల అంచల్ మామిద్వార్… మూడేళ్ల వారి పవిత్ర ప్రేమను… అంచల్ కుటుంబం కులం పేరుతో చిదిమేసింది. సాక్షాంది మరాఠా (ఓసీ) కాగా… అంచల్‌ది మహార్ (ఎస్సీ). ఈ జాతి భేదం అంచల్ తండ్రి గణేష్ మామిద్వార్, అన్నదమ్ములు హిమేష్, సహిల్‌లు పరువు పేరుతో రగిలిపోయారు. గత నవంబర్ 27న జూనా గంజ్ ప్రాంతంలో సాక్షాం స్నేహితులతో ఉన్నప్పుడు నిందితులు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు.
కళ్లెదుటే దారుణం…
ఆ రోజు సాయంత్రం సాక్షాంపై క్రూరమైన దాడి జరిగింది. అంచల్ సోదరుడు హిమేష్ ముందుగా కాల్పులు జరిపాడు. గుండెలకు బుల్లెట్ తగలడంతో సాక్షాం నేలకొరగగానే తలను రాళ్లతో పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. తండ్రి గణేష్, మరో సోదరుడు సహిల్‌తోపాటు ఇంకో ఇద్దరు ఈ కిరాతకానికి సహకరించారు. ఇది కేవలం కోపంతో జరిగింది కాదు… కుటుంబ ప్రతిష్ఠను కాపాడుకోవడం కోసం, కనీస మానవత్వం లేకుండా చేసిన హానర్ కిల్లింగ్. కుల దురహంకారం ఎంత భయంకరమైన హత్యకు దారి తీసిందో ఈ ఘటన నిరూపించింది.
రక్త సింధూరం… కుల వ్యవస్థపై తిరుగుబాటు
ప్రియుడు సాక్షాం మృతదేహాన్ని చూసిన అంచల్… ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది. కుల నియమాలను, కుటుంబ బెదిరింపులను ధిక్కరించి అతని ఇంటికి చేరింది. అంత్యక్రియల సమయంలో సాక్షాంను తన భర్తగా ప్రకటించింది. అతని రక్తంతో తన నుదుట సింధూరం పూసుకుని వివాహం చేసుకుంది. ఇది కేవలం భావోద్వేగం కాదు… కుల వ్యవస్థపై ఆమె చేసిన భీకర యుద్ధ ప్రకటన. ప్రేమను బలిగొన్న తన తండ్రి, సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని ఉరితీయాలని అంచల్ చేసిన డిమాండ్ చేసింది. కుల పట్టింపులు యువత జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో కళ్ల ముందు చూపించింది. మహారాష్ట్రలో ఎస్సీ, ఓసీ మధ్య ప్రేమలు తరచూ ఇలాగే హింసకు గురవుతున్నాయి.
కుల ఘర్షణల్లో ఆలస్యమవుతున్న న్యాయం…
హిమేష్, సహిల్, గణేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసి ముగ్గురినీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కుల హింస కేసుల్లో న్యాయం ఎప్పుడూ ఆలస్యం అవుతుందనే భయం వెంటాడుతోంది. మహారాష్ట్రలో కులాంతర వివాహాల పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత ఇలాంటి నేరాలకు కారణం. ఎస్సీ, ఓసీ భేదాలు యువతల ప్రేమ హత్యకు కారణం అవుతుంది. అంచల్ చూపిన ధైర్యం సమాజంలో ఐక్యతకు నిదర్శనం కావచ్చు. కానీ కులాలు మనుషులను విడదీసి, ప్రేమను చంపే ఈ వ్యవస్థను సమాజం ఎంతకాలం సహించాలి?