- 2021 ఫ్యాకల్టీకి బంపర్ ఆఫర్…
- టీటీజీడీఏ నేత డాక్టర్ కిరణ్ మాదల వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 334 మంది ఫ్యాకల్టీ సభ్యులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన పనిలేదని అధికారులు చెప్పారు. ఇకపై ఏసీఆర్‌ల కోసం నియామక తేదీకి ముందు ఉన్న 5 ఏళ్ల రికార్డులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పారు. ముఖ్యంగా పాత కార్యాలయం అధికారుల వద్దకు వెళ్లకుండా ప్రస్తుత ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ సంతకాలే చెల్లుతాయని స్పష్టం చేశారు.
2021 ఫ్యాకల్టీకి బంపర్ ఆఫర్…
2021లో సర్వీస్‌లో చేరిన ఫ్యాకల్టీ సభ్యులకు భారీ ఊరట లభించింది. వీరికి 4 ప్యానెల్ సంవత్సరాల సర్వీస్‌కు బదులుగా 4 అసలైన సంవత్సరాల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని అసోసియేట్ ప్రొఫెసర్ అర్హత కల్పిస్తున్నట్లు డీఎంఈ కార్యాలయం ధృవీకరించింది.
పీఎంసీఏ అలవెన్సుల ఫైల్ కదిలింది…
పీఎంసీఏ అలవెన్సుల ఫైల్ కూడా కదిలింది. 50% ప్రత్యేక అలవెన్స్‌కు అర్హులైన కళాశాలల గుర్తింపు కోసం గిరిజన సంక్షేమ శాఖ సహకారం కోరారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ జాబితాలో 9 కళాశాలలు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తక్కువ రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాల (రిమోట్ ఏరియాల) కళాశాలలకు సంబంధించిన 30% అలవెన్స్ ఫైల్‌ను కూడా చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఫ్యాకల్టీ వెంటనే సీఏఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, పారదర్శకంగా అమలు జరిగేలా తాము పర్యవేక్షిస్తామని డాక్టర్ కిరణ్ మాదల స్పష్టం చేశారు.