ఫుల్ బాటి(కి)ల్ – వయసు పెరిగే కొద్దీ మందు విషమే!

Age wise alcohol usage
  • 20 ఏళ్ల వయసులో మెదడుకు ముప్పు!
  • 30లలో ఊబకాయం… సంతాన సమస్యలు!
  • 40లలో క్యాన్సర్లు! మహిళల్లో హార్మోన్ల మార్పు
  • 50లలో మందులతో మృత్యు భయం!
  • 60 దాటితే అంతే సంగతులు…

సహనం వందే, హైదరాబాద్:

యుక్త వయసులో నాలుగు గ్లాసులు తాగినా తేలికగా పనిచేసే శరీరం… ఇప్పుడు రెండు గ్లాసులకే కళ్లు బైర్లు కమ్మి పడక చేరడానికి సిద్ధమవుతుందా? అయితే దానికి కారణం కేవలం వయసు మారుతూ ఉండటమే. వయసు పెరిగే కొద్దీ మందు మన శరీరంపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం… ముఖ్యంగా కాలేయం (లివర్) పనితీరు మందగించడం ఇందుకు ప్రధాన కారణం. 50, 70 ఏళ్ల వయసులో తాగే మద్యం… 20 ఏళ్లలో తాగిన దానికంటే ఎక్కువ హాని చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

20 ఏళ్ల వయసులో మెదడుకు ముప్పు!
సాధారణంగా మనిషి మెదడు నిర్మాణం (బ్రెయిన్ వైరింగ్) 25 ఏళ్ల వరకు పూర్తి కాదు. ఈ సమయంలో మద్యం అధికంగా సేవించడం వలన మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆలోచన, భావోద్వేగం, ప్లానింగ్ నియంత్రణకు సంబంధించిన మెదడు భాగం దెబ్బతింటుంది. అతిగా తాగడం వలన ఈ భాగం పరిమాణం 10 నుండి 15 శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. తద్వారా తాత్కాలికంగా మతిమరుపు (బ్లాక్‌అవుట్స్), తలనొప్పి వంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా ఇరవైలలో అతిగా తాగితే భవిష్యత్తులో మద్య వ్యసనం (డిజార్డర్) వచ్చే అవకాశం మూడు రెట్లు పెరుగుతుంది.

30లలో ఊబకాయం… సంతాన సమస్యలు!
30 ఏళ్లు దాటగానే శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. కాలేయం సామర్థ్యం తగ్గడం ఈ దశలోనే మొదలవుతుంది. ఈ వయసులో మందు తీసుకోవడం వలన త్వరగా అలసట, అధిక బరువు పెరుగుతుంది. అంతేకాక సంతానోత్పత్తిపై కూడా చెడు ప్రభావం పడుతుంది. వారానికి మూడు పెగ్గులు తాగినా అండం విడుదల ప్రక్రియ దెబ్బతింటుంది. పురుషుల్లోనూ టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గి వీర్య కణాలు నాణ్యత కోల్పోతాయి.

40లలో క్యాన్సర్ల ప్రమాదం!
నలభై ఏళ్ల మధ్య వయసులో మందు సేవించడం అత్యంత ప్రమాదకరం. ఈ దశలో తీసుకునే ప్రతి పెగ్గు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 7 నుండి 10 శాతం, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 17 శాతం వరకు పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలోనే రక్తపోటు, మధుమేహం, కొవ్వు వంటి సమస్యలు మొదలవుతాయి. మద్యం వీటన్నింటినీ మరింత ఉధృతం చేస్తుంది. మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే వేడి ఆవిర్లకు (హాట్ ఫ్లషెస్) మద్యం తోడై సమస్య మరింత ముదురుతుంది.

50లలో మందు – మృత్యు భయం!

యాభై ఏళ్ల తర్వాత కాలేయం దెబ్బతిన్నప్పుడు అది తిరిగి పునరుద్ధరణ (రీజనరేషన్) అయ్యే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. కొవ్వు పేరుకున్న కాలేయం ఈ దశలో వేగంగా సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులుగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది ఈ వయసులో రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు మందులు వాడుతుంటారు. మద్యం ఈ మందులతో కలిసినప్పుడు కాలేయ ఎంజైములు పెరగడం, తీవ్ర తలనొప్పి, రక్తపోటు ప్రమాదకరంగా పడిపోవడం వంటి అనూహ్య దుష్ప్రభావాలు ఎదురవుతాయి.

60 దాటితే పతనమే…
అరవై ఏళ్లు దాటిన తర్వాత మందు పూర్తిగా ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. ఇది శరీరంలో సహజంగా తగ్గే రోగ నిరోధక శక్తిని మరింత బలహీనపరుస్తుంది. అధికంగా తాగితే మతిమరుపు (డిమెన్షియా) ముప్పు 70 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. వృద్ధాప్యంలో కండరాలు బలహీనపడటం వలన శరీరం స్థిరంగా ఉండదు. ఈ దశలో మద్యం తీసుకోవడం వలన కింద పడి ఎముకలు విరిగే ప్రమాదం రెట్టింపు అవుతుంది. అందుకే 70 ఏళ్లు దాటిన వారికి ఏ వైద్య సంస్థ కూడా మద్యం సేవించమని సిఫార్సు చేయడం లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *