- ఈ ఏడాది 3.63 లక్షల మందికి అడ్మిషన్లు
- ప్రపంచంలోనే టాప్ లో నిలిచిన మనవాళ్లు
- అక్కడ చదవాలన్న బలమైన కోరికే కారణం
- చైనాను దాటి దూసుకెళ్తున్న విద్యార్థులు
సహనం వందే, న్యూఢిల్లీ:
అమెరికాలో చదవడానికి మన విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ట్రంప్ కారణంగా వీసా కష్టాలు ఇబ్బంది పెడుతున్నా… నిబంధనలు మారుతున్నా మనవాళ్లు ఏమాత్రం వెనక్కి చూడడం లేదు. అమెరికాలో చదివి తీరాల్సిందేనన్న బలమైన ఆకాంక్షతో అక్కడికి వెళ్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 9.5 శాతం ఎక్కువ. అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో చైనాను వెనక్కి నెట్టి భారత్ టాప్ ప్లేస్ కొట్టేసింది.
ట్రంప్ రాకతో ఆచితూచి…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో నిబంధనలు మరింత కఠినంగా మారాయి. దీనికి తోడు ఈ ఏడాది ఆరంభంలో కొత్తగా చేరేవారి సంఖ్యలో 7 శాతం తగ్గుదల కనిపించింది. వీసా ఇంటర్వ్యూల కోసం ఎక్కువ సమయం వేచిచూడాల్సి రావడం, డాక్యుమెంటేషన్ పెరగడం వంటి సవాళ్లు ఎదురయ్యాయి. అయినా సరే భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో విద్యార్థులు రిస్క్ తీసుకుంటున్నారు.
ఉపాధి కోర్సులకే ఓటు…
భారతీయ విద్యార్థులు గుడ్డిగా ఏదో ఒక కోర్సులో చేరడం లేదు. కచ్చితంగా ఉద్యోగం వచ్చే కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) విభాగాలకు ఫుల్ డిమాండ్ ఉంది. చదువు అయ్యాక అక్కడే పని చేసుకునే వెసులుబాటు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఉన్న కోర్సుల వైపు 47 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే చదువు…
ఆర్థిక భారం తగ్గించుకునేందుకు విద్యార్థులు పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. ప్రైవేటు వర్సిటీల కంటే తక్కువ ఖర్చయ్యే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకే 63 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఒకేసారి భారీగా అప్పులు చేయకుండా విడతల వారీగా చెల్లించే పద్ధతులు ఎంచుకుంటున్నారు.
చైనా వెనకడుగు… భారత్ ముందడుగు
చైనా విద్యార్థుల కంటే మన విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. గణాంకాలు చూస్తే తేడా స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య 2.65 లక్షలకు పడిపోగా… భారతీయ విద్యార్థులు మాత్రం 3.63 లక్షలతో దూసుకుపోతున్నారు. చైనా విద్యార్థుల సంఖ్యలో 4 శాతం క్షీణత నమోదైంది. మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్లేవారిలో ఆచితూచి అడుగులేసే ధోరణి ఉన్నా… డిగ్రీ కోసం వెళ్లేవారి సంఖ్యలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది.