‘చిల్ చిల్’ బేబీ… అమ్మ బిజీ – ఎగ్ ఫ్రీజింగ్ తో అండం నిల్వ మహిళకు వరం

Upasana Comments on Egg Freezing at IIT Hyderabad
  • దీంతో ఇష్టమైనప్పుడు పిల్లలను కనొచ్చు
  • మెగా కోడలు ఉపాసన బిగ్ కామెంట్స్
  • ’29 ఏళ్లకు ఫ్రీజ్… 36 ఏళ్లకు తల్లిని అయ్యా…’
  • తన ఉదాహరణ తెలిపిన చిరంజీవి కోడలు
  • ఐఐటీ హైదరాబాద్ కార్యక్రమంలో వ్యాఖ్యలు
  • లక్షలు ఖర్చు చేసే ధనికులకే ఈ అవకాశం
  • సామాన్య మహిళకు అందని ద్రాక్షన్న విమర్శ

సహనం వందే, హైదరాబాద్:
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ భార్య, అపోలో ఆస్పత్రి అధిపతి ఉపాసన ఇటీవల ఐఐటీ హైదరాబాద్ వేదికగా చేసిన ఎగ్ ఫ్రీజింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. మహిళలు తమకు ఇష్టమైన సమయంలో పిల్లలను కనే అవకాశం ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ఇస్తుందని ఆమె సలహా ఇచ్చారు. అంతేకాదు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత పిల్లలను కనవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది మహిళలందరికీ హుక్కు అని… కొందరికే పరిమితం కాదని ఆమె పేర్కొన్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని… కొన్ని కారణాలవల్ల 29 ఏళ్లకే అండాలను నిల్వ చేసుకుని… 36 ఏళ్లకు తల్లిని అయ్యానని… ఇప్పుడు 39 ఏళ్లకు కవలలకు జన్మను ఇవ్వబోతున్నానని ఉదాహరణగా చెప్పారు.

ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?
సాధారణంగా మహిళల అండాశయం నుండి అత్యంత ఆరోగ్యకరమైన అండాలను సేకరించి వాటిని అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద (మైనస్ 196 డిగ్రీల సెల్సియస్) భద్రపరుస్తారు. ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో క్రయోప్రిజర్వేషన్ లేదా అండాల శీతలీకరణ నిల్వ అంటారు. ఈ విధానంలో మొదటగా హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా అండాశయాన్ని ప్రభావితం చేస్తారు. అండాలు పరిపక్వం చెందిన తర్వాత చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా వాటిని సేకరిస్తారు.

ఆపై వాటిని విట్రిఫికేషన్ అనే వేగవంతమైన శీతలీకరణ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. భవిష్యత్తులో గర్భం దాల్చాలనుకున్నప్పుడు ఈ శీతలీకరించిన అండాలను బయటకు తీసి పురుషుడి శుక్రకణంతో కలిపి ఫలదీకరణం చేస్తారు. అనంతరం ఫలదీకరించిన ఆ పిండాన్ని తిరిగి మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

సామాన్య మహిళకు అందని ద్రాక్ష…
ఉపాసన గొప్పగా చెబుతున్న ఈ అండాల నిల్వ ప్రక్రియ ఎంత వ్యయంతో కూడుకున్నదో తెలుసుకుంటే ఇది సామాన్య మహిళకు ఎప్పటికీ హక్కు కాదని అర్థమవుతుంది. అండాలను సేకరించి శీతలీకరించే ప్రక్రియకే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ తర్వాత వాటిని నిల్వ చేసిన ప్రతి సంవత్సరానికి వేలకు వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాటిని ఉపయోగించి గర్భం దాల్చాలనుకుంటారో అప్పుడు మళ్లీ ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) అనే ఖరీదైన చికిత్స చేయించుకోవాలి. మొత్తంమీద ఈ ప్రక్రియకు దాదాపు పది లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. దేశంలో లక్షలాది మంది మహిళలకు కనీస ఆరోగ్య భద్రత కూడా దొరకని పరిస్థితుల్లో ఇంత వ్యయంతో కూడిన హక్కు గురించి చెప్పడం ఎంతవరకు సమంజసం?

ఎగ్ ఫ్రీజింగ్ తో ప్రయోజనాలు…
వైద్య కోణం నుండి చూస్తే ఈ అండాల శీతలీకరణ నిల్వ విధానం వల్ల ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. మహిళ 25 నుండి 35 ఏళ్లలోపు అండాలను నిల్వ చేసుకోవడం వలన వాటి నాణ్యత అలాగే ఉండిపోతుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత సహజంగా అండాల నాణ్యత పడిపోతుంది. కాబట్టి ఆలస్యంగా పిల్లలను కనాలనుకునే వారికి అండాల నాణ్యత లోపం వల్ల వచ్చే జన్యుపరమైన లోపాలను ఇది తగ్గిస్తుంది. కెరీర్, ఆర్థిక స్థిరత్వం కోసం పిల్లల్ని వాయిదా వేస్తున్న మహిళలకు ఇది ఒక బీమా పాలసీలా పనిచేసి భయాన్ని తగ్గిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *