- చెల్లించాలని ఇంటర్నేషనల్ కంపెనీల లేఖ
- పైసలిస్తేనే మందు… లేకుంటే బంద్ హెచ్చరిక
- డియాజియో, పెర్నోడ్ రికార్డ్ కంపెనీల ఫైర్
సహనం వందే, హైదరాబాద్:
అంతర్జాతీయ మద్యం దిగ్గజాలు తెలంగాణ సర్కారుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే లిక్కర్ సరఫరా నిలిపివేస్తామని తెగేసి చెప్పాయి. హైనెకెన్, డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి బడా కంపెనీలు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు లేఖ రాశాయి. ఏకంగా రూ. 2,988 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఇక తాము భరించలేమని స్పష్టం చేశాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే లాకర్లు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చాయి.

అదే జరిగితే ఖజానాకు గండి…
సరుకు సరఫరా నిలిచిపోతే రాష్ట్రంలోని 2,800 మద్యం దుకాణాలు వెలవెలబోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు రోజుకు కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు దొరకడం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మూడు ప్రధాన కంపెనీలు కనుక సరఫరా ఆపేస్తే దుకాణాలన్నీ ఖాళీ అయిపోయి ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
అధికారుల నిర్లక్ష్యం…
బకాయిలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిధుల లేమి సాకుతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మారాక కూడా బిల్లులు క్లియర్ కాకపోవడంతో కంపెనీల సహనం నశించింది. ఇక తమ వల్ల కాదని ఓపిక నశించి సరఫరా ఆపేస్తామని హెచ్చరించే స్థాయికి పరిస్థితి దిగజారింది. అధికారులు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో ఉన్నారు.
ఆ డబ్బంతా ఏమైంది
గత ఏడాది పన్నులు భారీగా పెంచి మద్యం ధరలను ఆకాశానికి ఎక్కించారు. దుకాణదారుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసుకుంటున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించకుండా ఏం చేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ నిధులను వేరే అవసరాలకు మళ్లిస్తున్నారని లేదా అప్పులు తీర్చడానికి వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతికి వచ్చిన ఆదాయాన్ని కూడా సదరు కంపెనీలకు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంది.
బ్లాక్ మార్కెట్ దందా
సరఫరా ఆగితే మద్యం ప్రియుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. షాపులు మూతపడితే బ్లాక్ మార్కెట్ మాఫియా చెలరేగిపోతుంది. రేషన్ షాపుల ముందు క్యూ కట్టినట్లు వైన్ షాపుల ముందు జనం పడిగాపులు కాసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తోంది. బకాయిల గొడవ ఇలాగే కొనసాగితే అది ప్రభుత్వానికే పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.