- ఢిల్లీ గూగుల్ ఒప్పందం… వైజాగ్ సమ్మిట్
- రెండుచోట్లా నారా లోకేష్ కీలక పాత్ర
- ఈ రెండు కార్యక్రమాల్లో కనిపించని పవన్
- కీలక ఒప్పందాలకు డిప్యూటీ సీఎం గైర్హాజర్
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు మంత్రి లోకేష్ హవా నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నిచోట్లా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు పార్టీ ఎంపీలను తనతో పాటు బీహార్ కు తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమికి ప్రచారం కూడా చేసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా లోకేష్ పట్టు సాధిస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో రియల్ హీరోగా లోకేష్ ఉంటే… రీల్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నారన్న విమర్శలున్నాయి.
లక్షల కోట్ల పెట్టుబడుల సమ్మిట్ కు దూరం…
విశాఖపట్నంలో రెండు రోజులు ఘనంగా జరిగిన పెట్టుబడుల సదస్సుకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేదు. లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పుకుంటున్న ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై జనసేన వర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్‌ను ఇంత పెద్ద కార్యక్రమానికి దూరం పెట్టడం వెనుక లోతైన వ్యూహం దాగి ఉందని జనసైనికులు అనుమానిస్తున్నారు. సంకీర్ణ కూటమి సాధించిన ఘనతను ఒకే కుటుంబం ఖాతాలో వేసుకునే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
జాతీయ వేదికలపైనా కనిపించని పీకే…
కేవలం వైజాగ్ సదస్సు మాత్రమే కాదు… గత నెల ఢిల్లీలో జరిగిన చారిత్రక గూగుల్ డేటా సెంటర్ ఒప్పంద కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ ఒప్పందం విషయంలోనూ చంద్రబాబు, లోకేష్‌లే కేంద్ర బిందువుగా నిలిచారు. పవన్‌ను ఇలాంటి జాతీయ స్థాయి వేదికల నుంచి వ్యూహాత్మకంగా దూరంగా ఉంచుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనుక సునిశితమైన రాజకీయ ఎత్తుగడ ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. గూగుల్ ఒప్పందంలో లోకేష్ పాత్రే కీలకం అని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు.
ప్రధాని కూడా దూరం పెడుతున్నారా?
ప్రధాని నరేంద్ర మోడీ కూడా లోకేష్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఒకసారి లోకేష్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని ఆతిధ్యం ఇచ్చిన ప్రధాని… రెండోసారి కూడా లోకేష్ ను ప్రత్యేకంగా పిలిచి ఆప్యాయత చూపారు. కర్నూలుకు వచ్చిన సందర్భంలోనూ లోకేష్ కు నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడారు. తండ్రిని మించిన తనయుడిగా కితాబు ఇచ్చారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల ప్రధాని వ్యవహార శైలి కూడా మారిందని అంటున్నారు. అంతేకాదు కీలకమైన బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.