- చీలిక వ్యూహంతో విజయం పొందిన ఎన్డీఏ
- బీహార్ ఎన్నికల సంగ్రామంలో జరిగిందిదే
- ఎన్డీఏ కూటమికి పీకే, ఒవైసీ పరోక్షంగా దన్ను
- జనసురాజ్ తో 35 చోట్ల లెక్కలు తారుమారు
- మహా కూటమికి ఆ ఇద్దరి డబుల్ డ్యామేజ్
సహనం వందే, పాట్నా:
గెలుపులో వ్యూహాలు మాత్రమే ఉంటాయి. వీటిని వదిలేసి మిగిలిన విషయాలు ఎంత చెప్పుకున్నా వృధానే. ఎన్నికల సంగ్రామంలో వ్యూహం లేకపోతే విజయం దక్కదని అందరికీ తెలుసు. కానీ బీహార్ మహా కూటమి నేతలకు మాత్రం ఇది బుర్రకెక్కలేదు. ఓట్ల చోరీ… ఇతర పార్టీల ఓట్ల చీలిక వల్ల ఓడిపోయామని చెప్పుకుంటున్నప్పటికీ… అవతలిపక్షం వాళ్లకి అవన్నీ వ్యూహాల కిందే లెక్క. ఆ వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ నాయకులు విజయం కోసం అస్త్రశస్త్రాలు సంధించారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే పక్షాన నిలిచాయి.
మహాకూటమికి డబుల్ డ్యామేజ్
ఎన్డీఏ కూటమి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పార్టీలు పోషించిన ‘స్పాయిలర్’ పాత్ర స్పష్టమవుతోంది. ఈ రెండు పార్టీలు ఎన్ని సీట్లు గెలిచాయనేది ముఖ్యం కాదు. ఈ రెండు శక్తుల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముస్లిం ఓటు చీలిపోవడం వల్లనే మహాకూటమి దారుణంగా దెబ్బతిన్నదనే విశ్లేషణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఈ ద్విముఖ దాడి బీహార్ రాజకీయాల్లో పార్టీలకు హెచ్చరికగా మారింది.
35 సీట్లలో ముంచిన పీకే…
ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఏకంగా 35 సీట్లలో గెలుపు ఓటముల తేడాను మించి ఓట్లు చీల్చింది. ఇందులో మహాగఠ్బంధన్ గెలిచిన 14 సీట్లు, ఎన్డీయే గెలిచిన 19 సీట్లు ఉన్నాయి. జనసురాజ్ ఓట్లు లేకపోతే ఈ 14 సీట్లలో కనీసం కొన్ని సీట్లు అయినా ఆర్జేడీ, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లేవి అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. జేడీయూను దెబ్బకొట్టడం ప్రశాంత్ వ్యక్తిగత ఎజెండాగా కనిపించినా… ఉన్నత కులాల ఓట్లతో పాటు ప్రతిపక్ష యువ ఓట్లను కూడా జనసురాజ్ చీల్చింది. పరోక్షంగా మహాకూటమికి దక్కాల్సిన యువ ఓటు బ్యాంక్‌ను గట్టిగా దెబ్బతీసింది.
సీమాంచల్‌లో ఒవైసీ పంజా…
బీహార్‌లో ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతం మహాకూటమికి ముఖ్యంగా ఆర్జేడీ-కాంగ్రెస్ కు బలమైన కోట. అయితే ఈ ఎన్నికల్లో ఒవైసీ ఎంఐఎం పార్టీ ఈ కోటను బద్దలు కొట్టింది. ఎంఐఎం మొత్తం 5 సీట్లు గెలుచుకుంది. ఈ 5 స్థానాలు మహాకూటమికి దక్కాల్సినవే. అంతటితో ఆగకుండా ఎంఐఎం పోటీ చేసిన ఇతర సీట్లలో అది చీల్చిన ఓట్ల వల్ల ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి భారీ నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా కిషన్‌గంజ్ జిల్లాలోని ఠాకూర్ గంజ్, కటిహార్ జిల్లాలోని బలరాంపూర్ వంటి కీలక స్థానాల్లో ఎంఐఎం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఆ ఓట్లు మహాకూటమి గెలుపు అవకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి.
పీకే, ఒవైసీలకు ఎన్డీఏ థాంక్స్ చెప్పుకోవాలి…
జనసురాజ్ పార్టీ యువ ఓట్లను, ఎంఐఎం ముస్లింల ప్రాతినిధ్యంపై పోరాడి మైనారిటీ ఓట్లను చీల్చడం వల్ల మహా కూటమి సీట్లు కోల్పోయిందనేది రుజువైంది. మరీ ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం మాత్రం ఆర్జేడీ-కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు పార్టీలు గెలుపు సాధించకపోయినా బీహార్ రాజకీయాల్లో ఓట్ల చీలిక వ్యూహం ఎన్డీయే విజయాన్ని ఎంత సులభతరం చేసిందో ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.