అడుగు ‘గుండె’నడుగు – గుండె ఆరోగ్యానికి సింగిల్ డోస్ నడక బెస్ట్

  • రోజు మొత్తం పలుసార్లు 10 వేల స్టెప్స్ వేస్ట్
  • ఒకేసారి గంటపాటు నడిస్తేనే ప్రయోజనం
  • లక్షలాది మందిపై శాస్త్రవేత్తల ప్రయోగం
  • అమెరికా, యూరప్ దేశాల్లో అధ్యయనం

సహనం వందే, హైదరాబాద్:
ప్రతిరోజూ ఉదయం అడుగులు లెక్కపెడుతున్నారా? పది వేల అడుగులు దాటాయా లేదా అని ఫోన్లలో పదే పదే చూసుకుంటున్నారా? అయితే మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే మీరు నడిచే విధానం మారాలి. కేవలం అడుగుల సంఖ్య పెరిగితే చాలదు… మీరు నడిచే తీరు ఆరోగ్యానికి కీలకం. ఇన్నాళ్లుగా అడుగులు లెక్కపెట్టిన మనం… ఇప్పుడు ఆ అడుగులను ఎలా వేస్తున్నాం అన్న దానిపై దృష్టి పెట్టాలని తాజా అంతర్జాతీయ పరిశోధన కరాఖండిగా తేల్చి చెప్పింది.

ఆరోగ్యానికి సింగిల్ డోస్ నడక!
అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల శాస్త్రవేత్తలు కలిసి లక్షలాది మందిపై ఐదేళ్లపాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా ఒకేసారి గంటపాటు నిరంతరాయంగా నడిచినవారిని, రోజంతా వాయిదాల పద్ధతిలో కొద్దికొద్దిగా నడిచినవారిని పోల్చి చూశారు. ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. ఒకేసారి ఎక్కువసేపు వేగంగా నడిచినవారిలో అద్భుతమైన ఆరోగ్య మార్పులు కనిపించాయి. వారిలో గుండె జబ్బులు, షుగర్ ప్రమాదం గణనీయంగా తగ్గింది. రోజంతా చిన్న చిన్న కదలికలతో అడుగులు పూర్తి చేసినవారిలో ఈ మార్పులు అంతగా కనిపించలేదు.

కేలరీల మర్మం… గుండె వేగమే అసలు కథ!
ఈ తేడాకు కారణం చాలా స్పష్టం. మనం ఒకేసారి ఎక్కువసేపు నడిచేటప్పుడు శరీరం నిల్వ ఉన్న శక్తిని ఉపయోగించి ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్త నాళాల నుంచి రక్తం ఉరకలేస్తూ ప్రవహిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ బర్నింగ్ ప్రక్రియే ఆరోగ్యానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నడవడం లేదా ఇంటి పనులు చేయడం వల్ల ఆశించినంత వేగంగా గుండె కొట్టుకోదు. తగినంతగా కేలరీలు ఖర్చు కావు.

టైం టేబుల్ మార్చాల్సిందే!
మీరు నిజంగా ఫిట్‌గా ఉండాలనుకుంటే మీ దినచర్యలో మార్పు తప్పనిసరి. ఉదయం లేవగానే లేదా సాయంత్రం పని అయిపోగానే నిరంతరాయంగా కనీసం అరగంట నుంచి గంటసేపు చురుకుగా నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఇంట్లో ఉంటూ లేదా షాపింగ్ చేస్తూ వేసే అడుగులు కేవలం అంకెలను మాత్రమే పెంచుతాయి కానీ మీ గుండెకు బలాన్ని ఇవ్వలేవు. కాబట్టి నడకకు ప్రత్యేకంగా సమయం కేటాయించండి.

యువతకు రన్నింగ్ తప్పనిసరి…
డెస్క్ ముందు కూర్చుని పనిచేసే యువతరం లిఫ్ట్ మానేసి మెట్లు ఎక్కడాన్ని మంచి వ్యాయామంగా భావిస్తున్నారు. ఇది కొంతవరకు మంచిదే అయినప్పటికీ ఇది మాత్రమే చాలదు. శరీరానికి బలం చేకూరాలంటే వారంలో కనీసం రెండు రోజులు ఉదయం పూట పరుగు రన్నింగ్ లేదా వేగవంతమైన వర్కవుట్లు చేయాలి. కేవలం చిన్నపాటి కదలికలు లేదా మెట్లు ఎక్కడం వంటివి పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వలేవని పరిశోధకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

వృద్ధులకు సలహా: స్పీడ్ కీలకం!
వయసు పైబడినవారు ఒకేసారి ఎక్కువసేపు నడవడం కష్టమైతే రోజుకు రెండు లేదా మూడు సార్లు పది నిమిషాలు నడవవచ్చు. కానీ ప్రతిసారీ నడిచేటప్పుడు నెమ్మదిగా కాకుండా కొంచెం వేగంగా అడుగులు వేయడం చాలా ముఖ్యం. వేగవంతమైన నడక మాత్రమే వయసు మీద పడినవారికి కూడా ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అధ్యయనంలో స్పష్టమైంది.

రక్త పరీక్షల్లో నిజం: కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్!
పరిశోధనలో నడిచినవారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి గంట నడిచినవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) పెరిగింది. ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగయ్యాయి. ఈ మార్పులన్నీ గుండెపోటు, మధుమేహం ముప్పును తగ్గిస్తాయి. అందుకే ఇకపై మీరు ఎన్ని అడుగులు వేశారు అనేది కాదు… ఆ అడుగులు ఎంతసేపు నిరంతరాయంగా వేశారు అనేదే ముఖ్యమని గుర్తుంచుకోండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *