దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!

  • రాష్ట్రంలో 73 ఏళ్ల చరిత్ర తిరగరాత
  • మొదటి దశలో ఓటర్ల ఉప్పెన!
  • దళిత స్థానాల్లో అసాధారణ ఓటింగ్
  • తీవ్ర పోటీతో భారీగా పెరిగిన ఓటింగ్ శాతం

సహనం వందే, పాట్నా:
మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి దశలో పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా ఓటింగ్ తగ్గకపోవడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఓటింగ్ శాతం పెంచిన దళిత్స్!
ఓటింగ్ లెక్కలను నిశితంగా పరిశీలిస్తే… షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం అసాధారణంగా పెరిగింది. అత్యధికంగా ఓటింగ్ శాతం పెరిగిన పది నియోజకవర్గాల్లో ఏడు రిజర్వ్‌డ్ సీట్లే ఉన్నాయి. పశ్చిమ బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరే నియోజకవర్గంలో ఏకంగా 16.1 శాతం ఓటింగ్ పెరిగింది. సమస్తిపూర్‌లోని కల్యాణ్‌పూర్‌లో 15.7 శాతం, సహర్సాలోని సోన్‌బర్షాలో 14.6 శాతం పెరిగింది. బీహార్ జనాభాలో దళితులు సుమారు 19.5 శాతం ఉన్నారు. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాకూటమి మధ్య నరాలు తెగే పోటీ ఉన్న నేపథ్యంలో దళిత ఓటర్ల సమీకరణ ఈ ఫలితాలను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఊపు!
గ్రామీణ దళిత నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఉప్పెనలా ఉంటే… బీహార్ పట్టణాలు మాత్రం నిస్తేజంగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని పాట్నాలోని కుమ్హ్రార్, బాంకీపూర్, దీఘా వంటి నియోజకవర్గాల్లో 2020తో పోలిస్తే స్వల్పంగా పెరిగినా… ఓటింగ్ శాతం 42 శాతం లోపే నమోదైంది. పాట్నాలోని ధనిక ప్రాంతాలు ఉన్న కుమ్హ్రార్‌లో కేవలం 39.6 శాతం ఓటింగ్ నమోదైంది. దీనికి విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాలైన ముజఫర్‌పూర్‌లోని మినాపూర్ వంటి సీట్లలో ఏకంగా 77.6 శాతం ఓటింగ్ నమోదై రాష్ట్రంలోనే అత్యధికంగా నిలిచింది. అభివృద్ధి, పాలన ఆధారంగా ఓటు వేసే పట్టణ ప్రాంతాలు తక్కువ ఓటింగ్‌తో ఉండటం వల్ల వారి ఎన్నికల గళం మౌనంగానే మిగిలిపోనుంది.

మార్పునకు కారణాలు… యువతే కీలకం!
ఈ చారిత్రక ఓటింగ్ పెరుగుదలకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఎన్నికల సంఘం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పోలింగ్ కేంద్రాలను పెంచడం వల్ల నిరీక్షణ సమయం తగ్గింది. రెండోది… హైపర్-లోకల్ ప్రచారం. రెండు ప్రధాన కూటములు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా భోజ్‌పురి, మైథిలీ వంటి స్థానిక భాషల్లో సందేశాలను పంపడం యువతను ఉత్తేజపరిచింది. మూడోది… పోటీ తీవ్రత. ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని పత్రికా సర్వేలు చెప్పడంతో తమ ఓటు అత్యంత ముఖ్యమైనదని ఓటర్లు భావించారు. ఈసారి బీహార్ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందనే పెరుగుతున్న భావన యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు కదిలించింది.

ఫలితంపై ఉత్కంఠ… ఎవరికి లాభం?
సాధారణంగా బీహార్‌లో ఓటింగ్ శాతం పెరిగినప్పుడల్లా అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే చరిత్ర ఉంది. 1990లో ఓటింగ్ పెరిగినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చారు. అయితే ఈసారి అధికార కూటమిలోనే నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉండటం వల్ల ఈ సూత్రం పనిచేస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ దళిత ఓటర్ల ఉప్పెన, పట్టణ ప్రాంతాల నిరాసక్తత, ప్రాంతీయ ఓటింగ్ వ్యత్యాసాలు ఫలితాలను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈనెల 14న వెలువడే ఫలితాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *