- పర్ఫెక్షన్ ముసుగులో బందీలా మారకండి
- తిరస్కరించే దమ్ముంటే విజయం మీదే!
- బ్రెయిన్ డంప్ చేయండి… రిలాక్స్ అవ్వండి
- అన్ని రంగాల్లో అత్యుత్తమం… చెత్త ఆలోచన
- మన లక్ష్యాలకు ఏది అవసరమో అదే చేయాలి
సహనం వందే, హైదరాబాద్:
ప్రతిచోటా నంబర్ వన్ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన మానసిక ఆందోళనతో కుప్పకూలిపోయింది. ఆ తర్వాతే ఆమె కళ్లు తెరుచుకున్నాయి.
పాత పద్ధతులకు మంగళం పాడండి…
ఆ భయంకరమైన అనుభవం అమండా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆఫీస్ పనిని, ఇంటి బాధ్యతలను, వ్యక్తిగత జీవితాన్ని మిక్సీలో వేసి కలిపినట్లు చేయడం ఆత్మహత్యా సదృశమని ఆమె గ్రహించింది. వెంటనే తన జీవితంలోని బాధ్యతలను వేరు వేరు విభాగాలుగా విభజించడం మొదలుపెట్టింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంటి గురించి… ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ టెన్షన్స్ గురించి ఆలోచించడం మానేసింది. ఈ తెలివైన విభజనా సూత్రం (కంపార్ట్‌మెంటలైజేషన్) ఆమె ఒత్తిడిని పూర్తిగా తుడిచిపెట్టింది. అన్నింటా నంబర్ వన్‌గా ఉండాలనేది సమాజం సృష్టించిన భ్రమ అని… ఈ విషపు పట్టుదల (టాక్సిక్ గ్రిట్) మనకు అక్కర్లేదని ఆమె గట్టిగా చెబుతోంది. అది మనల్ని నిలువెల్లా నాశనం చేస్తుందని ఆమె చెప్తున్నారు.
అన్నింటికీ ఎస్ అంటే… మనశ్శాంతి నో!
అమండా గోయెట్జ్ చెప్పే ప్రధాన సూత్రం పదునైనది. అన్ని రంగాల్లోనూ మనం అత్యుత్తమంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఏది అత్యంత ముఖ్యమో… మన లక్ష్యాలకు ఏది అవసరమో దాన్ని మాత్రమే ఎంచుకోండి. మిగతా వాటికి సరిపడా శ్రద్ధ పెడితే చాలు. నాలుగు సార్లు ఉన్నత స్థాయి అధికారిగా, ముగ్గురు పిల్లల తల్లిగా అగ్రస్థానంలో ఉన్న అమండా అనుభవం ఇదే. మనకు అత్యంత ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యతనిచ్చి… ఆతర్వాతే మిగతా పనులను పట్టించుకోవాలి.
బ్రెయిన్ డంప్… టెన్షన్‌కు చెక్ పెట్టండి!
మన మనసులో తిరిగే అనవసరపు ఆలోచనలను అమండా దోమల్లా ఇబ్బంది పెట్టే పనులు (మాస్కిటో టాస్కులు) అంటుంది. ఈ ఆందోళనను జయించడానికి ఆమె చెప్పే అద్భుతమైన ఆయుధం మెదడును ఖాళీ చేయడం (బ్రెయిన్ డంప్). అంటే టెన్షన్ కలిగించే పనులన్నిటినీ ఓ కాగితంపై రాసి పక్కన పడేయండి. అంతే మనసు తేలికపడుతుంది. అలాగే మీ శక్తి ఎంత? కేవలం 30 శాతమా? అయితే ఆ 30 శాతం పని చేస్తే చాలు. అదే మీరు 100 శాతం చేసినట్లు లెక్క! ఈ ఫార్ములా అలిసిపోవడాన్ని తరిమేస్తుంది.
తిరస్కరించే దమ్ముంటే విజయం మీదే!
అమండా సందేశం స్పష్టంగా ఉంది. పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే పాత ఆలోచనలకు గుడ్‌బై చెప్పండి. మీకు ఏది ముఖ్యమో దాన్ని పట్టుకోండి. మీ ప్రాధాన్యత జాబితాలో లేని లేదా మీ శక్తిని వృథా చేసే పనులను ధైర్యంగా కాదని (నో) చెప్పడానికి వెనుకాడొద్దు. తిరస్కరించడం అనేది మీ అహంకారం కాదు… మీ ఆత్మగౌరవం. మీ సమయాన్ని, మీ శక్తిని మీరు రక్షించుకోవడమే. ఆ ఒత్తిడి బరువును వదిలేసి మీకు నచ్చిన లక్ష్యాలను మాత్రమే సాధించండి. గుర్తుంచుకోండి… కాదని చెప్పే దమ్ము ఉంటేనే మీకు నిజమైన సంతృప్తి దక్కుతుంది.