బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే

  • రూ. 373 కోట్లతో రాణ్ కౌశల్ అగ్రస్థానం
  • బీఎస్పీ అభ్యర్థికి ఒక్క పైసా ఆస్తి లేదు
  • 243 స్థానాలకు 2,600 మంది పోటీ
  • బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల ఆస్తి అంతరం
  • కోటీశ్వరుల సంఖ్యలో భారీ పెరుగుదల
  • ఏడీఆర్, బీహార్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెల్లడి

సహనం వందే, బీహార్:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది. అధికార ఎన్డీఏ (జేడీయూ, బీజేపీ) కూటమిని మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్) కూటమి బలంగా సవాలు చేస్తోంది. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశ ఎన్నికలు నేడు (గురువారం) జరుగుతాయి.

రూ. 373 కోట్లతో అగ్రస్థానం…
ఈ ఎన్నికల్లో అత్యధిక ఆస్తులు ప్రకటించిన అభ్యర్థిగా వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి చెందిన రాణ్ కౌశల్ ప్రతాప్ సింగ్ అలియాస్ గుడ్డు సింగ్ నిలిచారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని లౌరియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈయన మొత్తం ఆస్తుల విలువ రూ.373 కోట్లు. ఈయన భార్యకు కూడా రూ.131 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయన కుటుంబం 3.4 కిలోల బంగారం, ఏడు లగ్జరీ వాహనాలు కలిగి ఉంది. మొదటి దశలో పోటీ చేస్తున్న వారిలో ముంగేర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ రూ.170 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు గయా నుంచి ఆర్ఎల్జేపీ అభ్యర్థి నితీష్ కుమార్ రూ.250 కోట్లు, మహారాజ్‌గంజ్ స్వతంత్ర అభ్యర్థి రాజ్ కిషోర్ గుప్తా రూ.137 కోట్లు, మోకామా జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ రూ.100 కోట్ల ఆస్తులు ప్రకటించారు.

పోటీలో నిరుపేద అభ్యర్థులు…
ఒకవైపు కోట్లాది రూపాయల ఆస్తులున్న కుబేరులు పోటీ చేస్తుండగా… మరోవైపు కనీస ఆస్తులు కూడా లేని అభ్యర్థులూ ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి సునీల్ కుమార్ చౌదరి (పిర్‌పైంటి) ఏకంగా సున్నా ఆస్తులను ప్రకటించి అందరికంటే పేద అభ్యర్థిగా నిలిచారు. అలాగే ఎస్‌యూసీఐ(సీ) పార్టీకి చెందిన మొజాహిద్ ఆలం (దర్భాంగా) కేవలం వెయ్యి రూపాయల ఆస్తిని ప్రకటించారు. రెండో దశలో అత్యంత పేద అభ్యర్థిగా మూలనివాసి సమాజ్ పార్టీకి చెందిన సురేష్ రాజవంశి (వజీర్‌గంజ్) రూ. 1100 ఆస్తితో బరిలో ఉన్నారు. ఈ గణాంకాలు బీహార్ రాజకీయాల్లోని సామాజిక-ఆర్థిక అంతరాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

రెండు దశల్లో పోలింగ్…
బీహార్‌లోని 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశ నవంబర్ 11న 122 స్థానాలకు నిర్వహించనున్నారు. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బీహార్ ఎలక్షన్ వాచ్ సంస్థలు మొత్తం 2,600 మంది అభ్యర్థుల స్వీయ ధృవీకరణ అఫిడవిట్‌లను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేశాయి. స్వతంత్ర అభ్యర్థులు, జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులతో ఎన్నికల డైనమిక్స్ ఆసక్తికరంగా మారాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *