- జోహ్రాన్ మామ్దాని విజయంతో మార్పు
- ఐరోపా దేశాల్లో ఎగిసిపడుతున్న ఉద్యమ అల
- సమస్యలపై లెఫ్ట్ వింగ్ పార్టీల కొత్త వ్యూహం
- జీవన వ్యయమే ప్రధాన అస్త్రంగా ముందుకు
సహనం వందే, యూరప్:
అమెరికాలో… ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి పట్టుకొమ్మగా భావించే న్యూయార్క్ నగర మేయర్ రేసులో జోహ్రాన్ మామ్దాని విజయం సాధించడం ఐరోపా అంతటా లెఫ్ట్ వింగ్ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే ప్రజాస్వామ్య సోషలిస్ట్ గా ప్రకటించుకున్న మామ్దాని… అద్దెల నియంత్రణ, ధనవంతులపై పన్ను విధిస్తాననే వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించారు. ఆయన వాదనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విజయం తమ దేశాలలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రైట్ వింగ్ శక్తులపై పోరాటానికి కొత్త దారి చూపిందని ఐరోపా లెఫ్ట్ వింగ్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యే సిద్ధాంతం: లెఫ్ట్ వింగ్ కొత్త వ్యూహం
మామ్దాని విజయం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి బ్రిటన్‌లోని గ్రీన్ పార్టీ, జర్మనీలోని ది లెఫ్ట్ వంటి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. వలస విధానం వంటి రైట్ వింగ్ ప్రాధాన్యతనిచ్చే అంశాల జోలికి పోకుండా తమ సామాజిక సిద్ధాంతాలపై దృష్టి పెట్టాలని ఈ పార్టీలు నిర్ణయించుకున్నాయి. బ్రిటిష్ గ్రీన్ పార్టీ నాయకుడు జాక్ పొలాన్స్కీ మాట్లాడుతూ… మామ్దాని విజయం ఉత్సాహం కలిగిస్తుందని పేర్కొన్నారు. కోట్లాది మంది ధనవంతులపై పన్నులు విధించి… ప్రజల ఖర్చులను తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు గెలిచిన గ్రీన్ పార్టీ… న్యూయార్క్ లో ఈ విజయం తర్వాత తమకు కొత్త ఊపు వచ్చిందని భావిస్తోంది.
జీవన వ్యయమే ప్రధాన అస్త్రం…
జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) సమస్యే తమ ఎన్నికల ప్రధాన అస్త్రమని లెఫ్ట్ వింగ్ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికమవుతున్న అద్దెలు, ఆహారం, విద్యుత్ ధరల పెరుగుదల వల్ల ఐరోపా ప్రజలు సతమతమవుతున్నారు. జర్మనీ లెఫ్ట్ పార్టీ అధినేత జాన్ వాన్ అకెన్ మాట్లాడుతూ… న్యూయార్క్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు జర్మనీలో కూడా ఉన్నాయని… ఈ సమస్యలను పరిష్కరించే మామ్దాని ఎన్నికల ప్రణాళిక తమ బెర్లిన్ ఎన్నికలకు బ్లూప్రింట్‌లా ఉపయోగపడుతుందని తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఫ్రాన్స్ అన్‌బౌడ్ పార్టీ నాయకురాలు మనోన్ ఆబ్రీ కూడా ఆర్థిక సరళీకరణను పక్కనబెట్టి దానిపై పోరాడితేనే లెఫ్ట్ వింగ్ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
సామాజిక సమస్యలే ఎజెండా…
మామ్దాని విజయం ప్రధాన లెఫ్ట్ వింగ్ పార్టీలైన బ్రిటన్‌లోని లేబర్ పార్టీ, జర్మనీలోని సామాజిక ప్రజాస్వామ్య పార్టీ (ఎస్‌పీడీ)లకు కూడా పునరాలోచనకు అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో అతి తక్కువ ఫలితాలు సాధించిన ఎస్‌పీడీ… తమ పోరాటాలలో సామాజిక విధానాలపై మరింత దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే వలస వ్యతిరేక విధానాలను అనుకరించకుండా… తమ సామాజిక సమస్యలపైనే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.