- కిచెన్ ఫ్లోర్‌లో భర్త శవం సమాధి!
- ఏడాది తర్వాత వెలుగులోకి…
- అదే ఇంటిలో నెలలపాటు నివాసం
సహనం వందే, అహ్మదాబాద్:
దృశ్యం సినిమాను తలపించే అత్యంత క్రూరమైన హత్యోదంతం అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సరిగ్గా ఏడాది క్రితం అదృశ్యమైన 35 ఏళ్ల సమీర్ అన్సారీ అనే వ్యక్తి అస్థిపంజరం మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బయటపడింది. అతడి ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద శవం లభ్యమైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో అతనిని అడ్డు తొలగించుకోవడానికి నిందితులు పక్కా పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

గొంతు కోసి… శరీరాన్ని ముక్కలు చేసి
పోలీసుల వివరాల ప్రకారం… ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సమీర్ భార్య రూబీ. అదే ప్రాంతంలో నివాసముండే తన ప్రియుడు ఇమ్రాన్ వాఘేలాతో పాటు, అతని బంధువులు రహీం, మొహసిన్‌లతో కలిసి రూబీ ఈ హత్యకు కుట్ర పన్నింది. తన భర్త తనను కొడుతున్నాడని, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి రూబీనే ఈ పథకాన్ని రచించిందని అరెస్టయిన ఇమ్రాన్ వాఘేలా వెల్లడించాడు. హత్య జరిగిన రోజు రాత్రి రూబీ సాయంతో ఇమ్రాన్ వాఘేలా సమీర్ గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కిచెన్ ఫ్లోర్‌ను తవ్వి గుంత తీసి అందులో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఫ్లోర్‌ను సిమెంట్, టైల్స్‌తో సీల్ చేసి ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా చేశారు.
నెలల పాటు పిల్లలతో అదే ఇంట్లో…
బీహార్‌కు చెందిన సమీర్ అన్సారీ 2016లో రూబీని ప్రేమ వివాహం చేసుకుని అహ్మదాబాద్‌కు వచ్చి మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సమీర్‌ను హత్య చేసిన తర్వాత కూడా రూబీ తన ఇద్దరు పిల్లలతో కలిసి నెలల తరబడి అదే ఇంట్లో నివాసం ఉంది. చివరకు అక్కడి నుంచి మారేటప్పుడు తన భర్త పని కోసం మరో నగరానికి వెళ్లాడని ఇరుగుపొరుగు వారికి అబద్ధం చెప్పింది. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ దారుణాన్ని పోలీసులు ఒక స్థానిక సమాచారం మేరకు గుర్తించారు. మూడు నెలల క్రితం సమీర్ అన్సారీ లేకపోవడంపై అనుమానం రావడంతో దర్యాప్తు ప్రారంభించగా ఇమ్రాన్ విచారణలో తలొగ్గి నేరాన్ని అంగీకరించాడు.
ఫోరెన్సిక్ పరీక్షలకు అస్థిపంజరం…
క్రైమ్ బ్రాంచ్ బృందం మేజిస్ట్రేట్ సమక్షంలో మంగళవారం రాత్రి సిమెంట్ చేసిన కిచెన్ ఫ్లోర్ నుంచి అస్థిపంజరాన్ని వెలికి తీసింది. ప్రస్తుతం ఆ అవశేషాలను ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల కోసం పంపారు. దీంతో హత్యకు గురైన వ్యక్తి సమీర్ అన్సారీ అని నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రియుడు ఇమ్రాన్ వాఘేలాను అరెస్టు చేయగా… ప్రధాన నిందితురాలు రూబీతో పాటు ఆమెకు సహకరించిన రహీం, మొహసిన్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.