రీల్స్ మత్తు… మోడీ ఎత్తు – 21 శతాబ్దపు మత్తు పదార్థం ‘రీల్స్’

  • యువత సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర
  • ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శల వెల్లువ
  • టెక్నాలజీ ఆటలో యూత్ మానసిక అస్వస్థత
  • ఈ వర్చువల్ ప్రపంచ పరధ్యానంలో జెన్ జెడ్
  • చౌక డేటా అందిస్తూ కంపెనీల వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన విమర్శల తూటాలను సంధించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ… దేశంలోని యువతను సామాజిక మాధ్యమాల ‘రీల్స్’ మత్తులో ముంచేసి ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు పట్టించుకోకుండా చేయాలని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ రీల్స్ మత్తు యువతను బానిసత్వం వైపు నెడుతోందని… ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో టెక్నాలజీని ఉపయోగించి యువతను పక్కదారి పట్టిస్తున్నారని… విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక సవాళ్లను వారు మరచిపోయేలా చేస్తున్నారని రాహుల్ ఘాటుగా విమర్శించారు.

రీల్స్: 21వ శతాబ్దపు మత్తుపదార్థం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు యువత భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారితీశాయి. మోడీ ప్రభుత్వం యువతను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌లో మునిగి ఉండేలా ప్రోత్సహిస్తోందని… దీనిని 21వ శతాబ్దపు కొత్త మత్తుగా అభివర్ణించారు. ఈ వర్చువల్ ప్రపంచం జెన్ జెడ్ యువతను పరధ్యానంలో ఉంచి… ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిలువరించే రాజకీయ వ్యూహంలో భాగం అని ఆయన ఆరోపించారు. ఒకవైపు ఉద్యోగాలు లేక యువకులు సతమతమవుతుంటే… మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉపాధి అవకాశాలను నాశనం చేస్తూ యువతను కూలీలుగా మారుస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.

టెక్నాలజీ ఆట: యువత మానసిక అస్వస్థత
రాహుల్ గాంధీ విమర్శల నేపథ్యంలో దేశంలో టెక్నాలజీ యువతను ఎలా పక్కదారి పట్టిస్తుందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాలకు యువత బానిసలై విద్య, ఉపాధి సవాళ్లను విస్మరిస్తున్నారు. రోజుకు ఆరు గంటలకు పైగా స్క్రీన్ టైం గడుపుతుండటంతో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సైబర్ బెదిరింపులు, వేధింపులు ఆందోళన, డిప్రెషన్‌కు దారితీస్తున్నాయి. భారతీయ యువతలో అధిక శాతం మంది సామాజిక మాధ్యమాల ప్రభావంతో నిద్ర లేమి, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. విద్యారంగంలోనూ రీల్స్ మత్తు కారణంగా విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి చదువుపై సమయం కేటాయించకుండా ఆన్‌లైన్ కంటెంట్‌కే అతుక్కుపోతున్నారు.

చౌక డేటాతో పరధ్యానం…
మోడీ ప్రభుత్వం చౌక ధరలకు డేటా అందిస్తూ రీల్స్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ నిజమైన ఉపాధి కల్పించడంలో మాత్రం విఫలమైందని రాహుల్ ఆరోపించారు. యువతలో నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలకు చేరింది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) వాటా 14 శాతానికి పడిపోగా… చైనా నుంచి దిగుమతులు రెట్టింపు అయ్యాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నాశనమయ్యాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీలక సమస్యల మధ్య సామాజిక మాధ్యమాలే యువతను వర్చువల్ ప్రపంచంలో ముంచి ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా ప్రశ్నించకుండా చేస్తున్నాయి.

రాజకీయ అజెండాలో చిక్కుకోవద్దు!
యువతను ఈ డిజిటల్ మత్తు నుంచి రక్షించాలంటే డిజిటల్ అక్షరాస్యత, మానసిక ఆరోగ్య అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పరిమితులు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ఈ విమర్శలు కేవలం ఎన్నికల పోరాటం కాదు… టెక్నాలజీని రాజకీయ ఆయుధంగా మారుస్తున్న పాలకపక్షంపై యువతకు ఒక హెచ్చరిక. యువత ఈ మత్తు నుంచి మేల్కొని తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *