రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత

  • దేశంలో పదేళ్లలో 14 లక్షల మంది దుర్మరణం
  • రోజుకు 420 మంది చొప్పున రోడ్లపై మృతి
  • నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు
  • శిక్షలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా డ్రైవింగ్

సహనం వందే, న్యూఢిల్లీ:
భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు ఈ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించాయి.

హత్యల కంటే ఐదు రెట్లు ఎక్కువ…
రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య ఇతర నేరాల కంటే అత్యంత అధికంగా ఉండటం గమనార్హం. ప్రతిరోజూ సగటున 85 మంది హత్యలకు గురవుతుండగా… రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య దీనికంటే ఐదు రెట్లు అధికంగా ఉంది. 2023లో 1,72,300 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. అంటే ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఆత్మహత్యల్లో ప్రాణాలు కోల్పోతున్న దాదాపు 400 మంది కంటే కూడా రోడ్డు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ పదేళ్లలో రోడ్డు మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉండగా… 2020లో కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా కాస్త తగ్గుముఖం పట్టినా… 2021లో ఏకంగా 17 శాతం పెరిగి రికార్డు సృష్టించాయి.

డ్రైవర్ల నిర్లక్ష్యం… పోలీసుల పట్టింపులేనితనం
భారత రోడ్లు ఇంతటి ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం… చట్టం అమలులో ఉన్న లోపమే. డ్రైవర్లు నియమాలను, ట్రాఫిక్ సంకేతాలను పట్టించుకోకుండా అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నిర్లక్ష్యానికి తగిన శిక్షలు లేకపోవడంతో డ్రైవర్లలో భయం లేకుండా పోయింది. ఇవి యాక్సిడెంట్లు కావు… ఇతరుల ప్రాణాలను విలువ చేయని సామాజిక నేరాలు అని నిపుణులు విమర్శిస్తున్నారు. రోడ్ల మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడం, ట్రాఫిక్ సంకేతాలు లేకపోవడం వంటి ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఈ విషాదాలకు పరోక్ష కారణాలవుతున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సైతం అజాగ్రత్తగా రోడ్లపై నడవడం లేదా ప్రయాణించడం ఈ నేరాలకు దోహదం చేస్తోంది.

కన్నీటి గాథలు… ఇటీవల ఘోర ప్రమాదాలు
రోడ్డు భద్రతపై ప్రజల్లో భయాన్ని పెంచుతూ, ఇటీవల జరిగిన ఘటనలు వ్యవస్థలోని లొసుగులను కళ్ళకు కడుతున్నాయి. 2025లోనే ప్రమాదాల సంఖ్య భయంకరంగా పెరిగింది. తాజాగా చేవెళ్లలో బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌లో డంపర్ ట్రక్కు వాహనాలను ఢీకొట్టడం, టెంపో ట్రావెలర్ అదుపుతప్పడం వంటి మూడు పెద్ద ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో జరిగిన రెండు బస్సు ప్రమాదాల్లో 40 మందికి పైగా మరణించారు.

తక్షణ చర్యలు తీసుకోకుంటే పెను ప్రమాదం
భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సామాజిక-ఆరోగ్య సమస్యగా మారిన రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తప్పనిసరి. ప్రభుత్వం పటిష్టమైన రోడ్డు మౌలిక సదుపాయాలను కల్పించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన శిక్షలు విధించడం ద్వారా డ్రైవర్లలో బాధ్యతను పెంచాలి. హెల్మెట్లు, సీట్‌బెల్టుల వాడకాన్ని కచ్చితంగా అమలు చేయాలి. రోడ్డు ప్రమాద మరణాలను కేవలం గణాంకాలుగా కాకుండా… ప్రతి మరణాన్ని ఒక నేరంగా పరిగణించి దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే తప్ప వీటిని ఆపలేం. లేదంటే రోడ్లు నిత్యం వందలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తూనే ఉంటాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *