- ‘మెర్కోర్’ కంపెనీ స్థాపించి ఏఐలో దూకుడు
- 30 వేల మంది నిపుణులతో ప్రత్యేక సైన్యం…
- కంపెనీ విలువ రూ. 83 వేల కోట్లకు పరుగులు
- వారి వ్యక్తిగత సంపద రూ. 16,600 కోట్లు
- ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు చెమట
సహనం వందే, న్యూయార్క్:
సిలికాన్ వ్యాలీ సాక్షిగా ఇద్దరు భారతీయ యువ కెరటాలు చరిత్ర సృష్టించారు. 22 ఏళ్లకే స్వయం కృషితో ప్రపంచ బిలియనీర్ల రికార్డును బద్దలు కొట్టారు. ఆదర్శ్ హిరేమఠ్, సూర్య మిడ్హా అనే ఈ ఇద్దరు యువకులు ఏఐ రిక్రూట్‌మెంట్ యాప్ ‘మెర్కోర్’తో సంచలనం సృష్టించారు. తాజాగా రూ. 2,900 కోట్ల భారీ ఫండింగ్ గెలుచుకోవడంతో ఈ కంపెనీ విలువ ఒక్కసారిగా రూ. 83,000 కోట్లకు ఎగబాకింది. తద్వారా మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును చెరిపేసి సుమారు రూ. 16,600 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ యువకులు అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల రాజ్యాన్ని స్థాపించారు.

ఢిల్లీ మూలాలు… కాలిఫోర్నియా కలలు
ఈ విజేతల్లో ఒకరైన సూర్య మిడ్హా తల్లిదండ్రులు ఢిల్లీ నుండి అమెరికాకు వలస వెళ్లారు. సూర్య కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జన్మించి శాన్ జోస్‌లో పెరిగారు. ఆదర్శ్ హిరేమఠ్ సైతం భారతీయ మూలాలు కలిగి ఉండి కాలిఫోర్నియాలోనే పెరిగారు. వీరిద్దరూ శాన్ జోస్‌లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీలో హైస్కూల్ స్నేహితులు.
నిద్రలేని రాత్రులు… కాలేజీకి టాటా
వేగంగా ఆలోచించడం, ఒప్పించగలిగే తర్కం ఈ యువకుల ఆయుధాలు. వీరిద్దరూ హైస్కూల్లో ప్రఖ్యాత డిబేట్ టీంలో సభ్యులుగా ఉండి జాతీయ స్థాయిలో పలు టోర్నమెంట్లు గెలుచుకున్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఈ స్నేహితులు పడిన ఘర్షణలే నేడు ప్రపంచానికి పరిష్కారాన్ని చూపాయి. ఆదర్శ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా, సూర్య జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో ఫారెన్ స్టడీస్ చదివారు. అయితే రాత్రి జాగారాలతో చేసిన ఆలోచనలే ఇప్పుడు వారికి బంగారు గనులుగా మారాయి.

ప్రముఖ పెట్టుబడిదారుడు పీటర్ థీల్ అందించే ‘థీల్ ఫెలోషిప్’ లక్ష డాలర్ల గ్రాంట్ వీరిని కాలేజీ వదిలేలా ప్రోత్సహించింది. సిలికాన్ వ్యాలీ పిలుపును అందుకుని చదువుతూనే 2023లో తమ మూడో సహ-వ్యవస్థాపకుడు (బ్రెండన్ ఫూడీ)తో కలిసి ‘మెర్కోర్’ను ప్రారంభించారు.
30 వేల మందితో నిపుణుల సైన్యం…
మొదట్లో ఇది కేవలం భారతీయ కోడర్లను అమెరికా స్టార్టప్‌లకు అనుసంధానించే సాధారణ ఫ్రీలాన్స్ యాప్‌గా ఉండేది. కానీ ఏఐ రంగంలో వచ్చిన అనూహ్య బూమ్ ఈ యాప్‌ను ఊహించని వేగంతో రాకెట్‌లా ముందుకు తీసుకెళ్లింది. చాట్ జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాలకు డేటా నాణ్యత, మానవ మేధస్సు అవసరం తీవ్రంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను పసిగట్టిన ‘మెర్కోర్’ ఒక్కసారిగా ఏఐ రిక్రూట్‌మెంట్ యంత్రంగా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది నిపుణుల సైన్యాన్ని ఇది ఏర్పాటు చేసింది. న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజినీర్ల వంటి అత్యున్నత వృత్తి నిపుణులు ఈ వేదిక ద్వారా ఏఐ మోడల్స్‌కు పని చేస్తున్నారు. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పుడు ఈ యాప్‌కు కస్టమర్లుగా మారాయి.
టర్బో బూస్ట్‌తో వేగంగా ఎదుగుదల…
మెర్కోర్ బృందంలో కేవలం ముప్పై మంది మాత్రమే ఉన్నారు. వారి సగటు వయసు 22 ఏళ్లు. 2024 సెప్టెంబర్ లో రూ. 265 కోట్ల సీరీస్-ఏ ఫండింగ్ అందుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ. 830 కోట్ల సీరీస్-బీ ఫండింగ్‌తో ఏకంగా రూ. 16,600 కోట్ల వాల్యుయేషన్‌కు ఎగబాకింది. ఇది సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ఎదుగుదలగా నమోదైంది. ఈ వారం రూ. 2,900 కోట్ల సీరీస్-సి రౌండ్‌తో మెర్కోర్ ఏకంగా రూ. 83,000 కోట్ల వాల్యుయేషన్‌తో ఈ ఇద్దరు దేశీ యువకులను బిలియనీర్ల హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అడుగు పెట్టించింది.