- కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐ
- భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధికం
- ఒక్కసారిగా కోటీశ్వరులైన మహిళ క్రికెటర్లు
సహనం వందే, న్యూఢిల్లీ:
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి భారత నారీశక్తి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో ఈ చరిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. దేశం గర్వించేలా చేసిన ఈ క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐ
విశ్వవిజేతగా నిలిచిన మహిళా జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోట్లాది రూపాయల నగదు బహుమతిని కురిపించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించిన వివరాల ప్రకారం… ఈ విజయానికి గానూ జట్టుకు 51 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతి లభించనుంది. ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ ఈ మొత్తం పంచుతారు. అదనంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి 39.78 కోట్ల రూపాయలు లభిస్తాయి. మొత్తం మీద 90 కోట్లకు పైగా సొమ్ము టీమ్ ఇండియా ఖాతాలో చేరనుంది. ఇది మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద బహుమతి మొత్తం కావడం విశేషం.
మారిన మహిళా క్రికెట్ రూపురేఖలు
బీసీసీఐ అధ్యక్షుడు జయ్ షా మహిళల క్రికెట్‌కు ఊతమిచ్చేందుకు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ విజయం అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చొరవతోనే మహిళా క్రికెట్‌లో జీతాలు, కోచింగ్ విధానంలో కీలక మార్పులు, అత్యంత విజయవంతమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభమయ్యాయి. ఈసారి ప్రపంచకప్ బహుమతి మొత్తం ఏకంగా 123 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 297 శాతం పెరగడం మహిళా క్రికెట్‌పై బీసీసీఐ చూపిస్తున్న శ్రద్ధకు నిదర్శనం.
కోటీశ్వరులైన క్రీడాకారిణులు…
ఈ అద్భుత విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు క్రీడాకారిణులుగా మాత్రమే కాకుండా ఆర్థికంగానూ కోటీశ్వరులుగా మారనున్నారు. ఈ చారిత్రక విజయం మహిళల క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా కాకుండా గౌరవప్రదమైన వృత్తిగా మార్చివేసింది. తద్వారా రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. లక్షలాది మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఈ ప్రపంచకప్ విజయం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.