యువత మౌనం వెనుక మర్మం! – జెన్ జడ్ నిశ్శబ్దం… వీధుల్లోకి రాని నేటితరం

  • దేశంలో 37 కోట్ల మంది జెన్ జడ్ యువకులే
  • సోషల్ మీడియాలో చురుకైనా వెనుకడుగు
  • భయపెడుతున్న దేశద్రోహం ముద్ర…
  • కులం, ప్రాంతం… విభజనల చెరలో యువశక్తి

సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో దాదాపు 37 కోట్ల మంది జెన్ జడ్ యువత ఉంది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో నిత్యం అనుసంధానమై ఉన్న ఈ శక్తిమంతమైన తరం… దేశంలో ఉన్న అవినీతి, అసమానతలు, రాజకీయ గందరగోళంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. కానీ వీధుల్లోకి వచ్చి గళమెత్తడానికి మాత్రం వెనుకాడుతోంది. దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం, కుల, ప్రాంతీయ విభజనలు, నిరుద్యోగంతో కూడిన ఆర్థిక ఒత్తిళ్లు, మార్పు అసాధ్యమనే నిరాశ… నేటి తరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతున్నాయి. ప్రపంచంలో అనేక చోట్ల యువత ప్రభుత్వాలను కుప్పకూలుస్తుంటే ఇక్కడ వీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

పొరుగు దేశాల్లో గర్జన…
మన పొరుగున ఉన్న నేపాల్‌లో యువ నిరసనకారులు కేవలం 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టారు. బంగ్లాదేశ్‌లో ఉద్యోగ కోటా, అవినీతిపై యువత ఆగ్రహం ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేసింది. ఇండోనేషియాలో నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయంపై ఉద్యమించి కొంతవరకూ ఫలితాలు సాధించారు. మడగాస్కర్ లో అధ్యక్షుడిని పారదోలారు. సామాజిక మాధ్యమాలు ఈ ఉద్యమాలకు ఊతమిచ్చాయి. కానీ భారతదేశంలో మాత్రం జాతీయ స్థాయిలో యువత గళం వినపడటం లేదు. లద్దాఖ్‌లో రాష్ట్ర హోదా కోసం జరిగిన హింసాత్మక నిరసనలు మినహా జాతీయస్థాయి ఉద్యమం ఎందుకు రావడం లేదనేది పెద్ద ప్రశ్న.

కులం, ప్రాంతం… విభజనల చెరలో యువశక్తి
భారత జెన్ జడ్ యువత ఒకే గొంతుకగా ఏకం కావడం కష్టం. కులం, భాష, ప్రాంతీయ గుర్తింపులు వారిని చీల్చివేస్తున్నాయి. హైదరాబాదుకు చెందిన అమృత అనే జర్నలిస్ట్ చెప్పినట్టు… యువతను ఏకం చేసే శక్తి ఎక్కడా కనిపించడం లేదు. నగరంలో ఉండే యువత తమ ఉద్యోగాలు, మెరుగైన సౌకర్యాలపై దృష్టి పెడుతుంటే… దళిత యువత కుల వివక్ష, సామాజిక న్యాయం కోసం పోరాడుతోంది. తమిళ యువత తమ భాష, సంప్రదాయాల రక్షణ కోసం కృషి చేస్తోంది. ఈ అంతర్గత విభజనలే దేశవ్యాప్త ఉద్యమానికి అడ్డుగా నిలుస్తున్నాయి.

భయపెడుతున్న దేశద్రోహం ముద్ర…
నిరసనల్లో పాల్గొంటే దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం యువత గుండెల్లో బలంగా నాటుకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ విద్యార్థి చౌదరి ఆవేదన ఏంటంటే… ఏ చిన్న నిరసననైనా జాతి వ్యతిరేక చర్యలుగా చిత్రీకరిస్తున్నారు. ఒకప్పుడు ఉద్యమాలకు కేంద్రాలుగా ఉండే విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. వర్సిటీకి చెందిన పరిశోధకురాలు కల్పన చెప్పినట్టు… విద్యాలయాలు తమ పోరాటతత్వాన్ని కోల్పోయాయి. 2019లో సీఏఏ నిరసనలపై జామియా, అలీఘర్‌లలో జరిగిన పోలీసు దాడులు, విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్‌ను ఐదేళ్లుగా జైలులో ఉంచడం యువతను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జేఎన్ యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై దేశద్రోహం ముద్ర వేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు.

స్థానిక సమస్యలేనా? జాతీయస్థాయి ఎక్కడ?
భారత యువత ఆగ్రహం కేవలం స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతోంది. గుజరాత్, హరియాణాలో రిజర్వేషన్ల కోసం..‌. తమిళనాడులో జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత జాతీయ సమస్యలపై మాత్రం మౌనంగా ఉంటోంది. ఈ ఆందోళనలు జాతీయ స్థాయిలో ఏకం కావడం లేదు. 2024 ఎన్నికల్లో 18 ఏళ్ల యువతలో కేవలం 38 శాతం మంది మాత్రమే ఓటర్లుగా నమోదవడం… 29 శాతం యువత రాజకీయాలకు దూరంగా ఉండటం యువతలో నెలకొన్న నిరాశను స్పష్టం చేస్తున్నాయి.

నిరుద్యోగం, వలసలు… ఉద్యమాలకు అడ్డంకి
నిరుద్యోగ భయం, ఆర్థిక ఒత్తిళ్లు యువతను నిరసనల వైపు వెళ్లనీయకుండా కట్టడి చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నా… ఉద్యోగం పోతుందనే భయం యువతను వెంటాడుతోంది. రాజకీయాలపై నమ్మకం కోల్పోయిన ఈ తరం… ఇప్పుడు మత, సాంస్కృతిక గుర్తింపుల వైపు మళ్లుతోంది. 2024 సర్వేలో బీజేపీకి యువత మద్దతు స్వల్పంగా తగ్గినా, హిందూ జాతీయవాద ఆలోచనలు ఇప్పటికీ బలంగా ఉండటం గమనార్హం. గతంలో వచ్చిన అన్నా హజారే ఉద్యమం, ఢిల్లీ అత్యాచార ఘటనపై నిరసనలు వీరికి చైతన్యాన్ని ఇచ్చినా, ప్రభుత్వ నిర్బంధం వీరిని నిశ్శబ్దంగా ఉంచుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *