అమెజాన్‌లో 30,000 మంది ఔట్- నేటి నుంచి భారీగా ఉద్యోగాల ఊచకోత

  • టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:
నేటి (మంగళవారం) నుంచి అమెజాన్‌లో మరోసారి భారీగా ఉద్యోగాల తొలగింపు మొదలుకానుంది. ఏకంగా 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి కంపెనీ సిద్ధమైంది. కరోనా సమయంలో అధికంగా నియామకాలు చేపట్టిన అమెజాన్… ఇప్పుడు ఖర్చులను కట్టడి చేసే పేరుతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటే… అందులో కార్పొరేట్ సిబ్బంది 3.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

మానవ వనరుల శాఖలో అధిక సంక్షోభం…
ఈ ఉద్యోగ తొలగింపులో మానవ వనరుల (హెచ్ఆర్) శాఖ గట్టిగా దెబ్బ తింది. ఈ విభాగంలో ఏకంగా 15 శాతం ఉద్యోగాలు తగ్గించనున్నారు. దీంతో పాటు డివైసెస్, సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాలు కూడా ఈ కోతలకు ప్రభావితం కానున్నాయి. గత రెండేళ్లుగా చిన్న చిన్న కోతలు జరుగుతున్నా ఈసారి మాత్రం ఇది అతి పెద్ద ఊచకోతగా చెప్పవచ్చు. గతంలో పాడ్‌కాస్టింగ్ డివిజన్‌, ఏడబ్ల్యూఎస్‌లో వందల మందిని, డివైసెస్ యూనిట్‌లో వంద మందిని తొలగించిన ఘటనలు మరువకముందే ఈ భారీ నిర్ణయం వెలువడింది.

జస్సీ అధిక బ్యూరోక్రసీ బండారం
కంపెనీ అధిపతి ఆండీ జస్సీ అధిక బ్యూరోక్రసీని తొలగించడానికి నడుం కట్టారు. దీనిలో భాగంగా మేనేజర్ల లేయర్లను తగ్గించడంపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా అంతర్గత అవకతవకలు, సమస్యలపై సుమారు 1500 ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 450 ప్రక్రియలను మార్చగా కొంతమంది మేనేజర్లు కూడా ఈ ప్రక్షాళనలో తమ ఉద్యోగాలను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కృత్రిమ మేధతో కొలువులకు ముప్పు
జూన్ నెలలోనే అధిపతి జస్సీ కృత్రిమ మేధ (ఏఐ) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ పనులను ఆటోమేట్ చేస్తుందని అప్పుడే సంకేతం ఇచ్చారు. ఇది ఉద్యోగాలు మరింత కోసేస్తాం అనే హెచ్చరికగా మారింది. ఈ సాంకేతిక మార్పులను స్వీకరించేవారు మాత్రమే కంపెనీలో మిగిలి ఉంటారని, మిగతావారు ఇంటికి వెళ్లక తప్పదని ఆయన పరోక్షంగా చెప్పడం టెక్‌ ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతోంది.

నియామకాల మాయాజాలం…
ఇలా వేల మందిని తొలగిస్తున్నప్పటికీ… మరోవైపు హాలిడే సీజన్ కోసం రెండు లక్షల యాభై వేల మంది సీజనల్ వర్కర్లను తీసుకోవడం గమనార్హం. ఇది కంపెనీ విధానాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ కోతల నేపథ్యంలో కూడా సోమవారం అమెజాన్ షేర్లు 1.3 శాతం పెరిగి రెండు వందల 27 డాలర్లకు చేరాయి. గురువారం కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్నాయి.

టెక్ రంగంలో కోతల కోలాహలం…
అమెజాన్‌లో జరుగుతున్న ఈ కోత టెక్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 216 కంపెనీలు కోతలు చేయగా… ఏకంగా 98 వేల టెక్ ఉద్యోగాలు పోయాయి. గత ఏడాది 1.53 లక్షల ఉద్యోగాలు తగ్గగా… టెక్ రంగం క్రమంగా కుదించుకుపోవడం యువత భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *