- కార్పొరేట్ ఒంటరితనం నుంచి రిలీఫ్
- అపరిచితులతో మాట్లాడే థ్రిల్ కోసం కూడా
సహనం వందే, హైదరాబాద్:
క్యాబ్ డ్రైవర్ మీకు ఫోన్‌లో కార్పొరేట్ భాషలో సమాధానమిస్తే ఆశ్చర్యపోకండి. అతను టెక్కీ అయి ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒంటరితనం, ఆఫీసులో అవిశ్రాంతంగా చేసిన పని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి రాత్రిళ్లు క్యాబ్‌లు నడుపుతున్నారు. ఇది మన కార్పొరేట్ సంస్కృతిలోని దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుంది.
టెక్కీల కొత్త జీవనం
అభినవ్ అనే 27 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పనిలో పెద్ద మార్పు లేదు. ప్రతిరోజు చేసిన పనే చేస్తూ ఉండాల్సి వచ్చేది. మరోవైపు ఇంట్లో ఒంటరితనం అతన్ని కుంగదీశాయి. దీంతో అతను క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. పగలు టెక్కీగా… రాత్రి క్యాబ్ డ్రైవర్‌గా రెండు విభిన్నమైన జీవితాలను కొనసాగిస్తున్నాడు. అతను వారంలో రెండు రాత్రులు విమానాశ్రయ మార్గంలో క్యాబ్ నడుపుతాడు.
హైదరాబాద్ మాత్రమే కాదు…
ఇలాంటి టెక్కీలు ఒక అభినవ్ మాత్రమే కాదు. ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్‌లలో టాప్ ఐటీ కంపెనీల టెక్కీలు క్యాబ్ డ్రైవర్లుగా కనిపిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ హబ్‌లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో కూడా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఒంటరితనం, పని ఒత్తిడి, కొంతమంది తమ గుర్తింపును దాచుకుని అపరిచితులతో మాట్లాడే థ్రిల్ కోసం ఈ పని చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలే సాక్ష్యం
సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి గురించి ఎన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒక లింక్డ్‌ఇన్ యూజర్ తన ర్యాపిడో డ్రైవర్ టెక్కీగా ఉన్న అనుభవాన్ని షేర్ చేశాడు. మరొకరు తమ బాస్ ఊబర్ డ్రైవర్‌గా కనిపించినట్లు పేర్కొన్నారు. కొందరు టెక్కీలు రాత్రి పని ద్వారా అదనపు ఆదాయం కోసం చేస్తుంటే... మరికొందరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఆరేడు వేల అదనపు ఆదాయం…
12 గంటలకు పైగా కార్యాలయంలో గడపడం, రోజూ ఒకే విధమైన జీవనశైలి టెక్కీలను కుంగదీస్తోంది. విమానాశ్రయ మార్గంలో క్యాబ్ నడపడం వారికి ఒక విముక్తి. అదనంగా రాత్రి రెండు ట్రిప్పులతో ఆరేడు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ టెక్కీలు తమ రాత్రి డ్రైవర్ ఉద్యోగం ద్వారా కొత్త వ్యక్తులను కలుస్తూ కొందరు ఉద్యోగ ఆఫర్లు కూడా పొందుతున్నారు. ఒక ఎంబీఏ విద్యార్థి మూడు రోజుల పాటు ఊబర్ డ్రైవర్‌గా పనిచేసి అనుభవాలను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నాడు.