‘చేగువీర’త్వం… లోక’కళ్యాణం’ – పవన్ కళ్యాణ్ క్రేజీకి ఈ రెండే కారణం

  • రాజకీయ శత్రువు గుండెల్లో అగ్గిబరాట
  • సామాన్యుడి హృదయంలో సౌమ్యుడు
  • యువతకు వెర్రెక్కించే పవర్ స్టార్ సినీ హీరో
  • క్రేజ్ నెవర్ డైస్… జస్ట్ మల్టిప్లైస్!
  • ఆయన క్రేజ్ ను చూసి బిత్తర పోయిన విదేశీ

సహనం వందే, హైదరాబాద్:
తెలుగునాట పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు యువ హృదయాలు ఉర్రూతలూగుతాయి. సినిమా తెరపై గన్ పట్టుకున్నా… రాజకీయ రణరంగంలో జనసేన జెండా ఎగరేస్తూ దూసుకెళ్లినా ఆయన పట్ల అభిమానం ఒక ఉద్వేగం. బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించకపోయినా… వ్యక్తిగత జీవితంలో వివాదాలు వెంటాడినా… సిద్ధాంతాల్లో మార్పులు విమర్శలకు దారితీసినా… పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాకు చెందిన ఒక పౌరుడు వచ్చాడు. దాదాపు రెండు వారాలు ఆ రాష్ట్రంలో తిరిగాడు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆయన పవన్ క్రేజ్ చూసి నిర్ఘాంత పోయారు. ఆయనకు అంత క్రేజ్ ఎలా వచ్చిందని ఆయన ఆరా తీశారు. అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి?

సినిమాలను దాటిన అభిమానం…
పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంలో ఖుషీ, బద్రి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి పలు చిత్రాలతో ఓ తరాన్ని ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఖుషీ సినిమాలో యువతను ఆకట్టుకునే నటన, తమ్ముడు చిత్రంలో బాక్సింగ్ నేపథ్యంలో స్ఫూర్తిని ఇచ్చే పాత్రలు ఆయనకు ఫాలోయింగ్ పెంచాయి. ఆయన ప్రత్యేకమైన శైలి, డైలాగ్స్ ఆకర్షించాయి. అయితే అత్తారింటికి దారేది తర్వాత ఆయన చిత్రాలు వాణిజ్యపరంగా పెద్ద విజయాలు అందుకోలేదు. అయినా ఆయన క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు.

వివాదాలున్నా విశ్వసనీయత
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. మూడు వివాహాలు, విడాకులు ఆయనపై విమర్శలకు తావిచ్చాయి. అయినప్పటికీ ఆయన తన మాజీ భార్యలతో గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు అభినందనీయం. మాజీ భార్య రేణు దేశాయ్‌తో పుట్టిన పిల్లలు అకిరా, ఆద్యలకు తండ్రిగా, స్నేహితుడిగా ఉంటూ ఆమెతో సౌహార్దపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన మాజీ భార్యలెవరూ ఆయనపై పబ్లిక్‌గా విమర్శలు చేయలేదు. ఈ సౌమ్యత, మానవత్వం లక్షల మంది మహిళా అభిమానులను ఆయనకు చేరువ చేసింది.

సిద్ధాంతం అయోమయం! అయినా…
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సైతం వివాదాలకు అతీతం కాదు. ఒకప్పుడు విప్లవ వీరుడు చేగువేరాను ఆదర్శంగా చెప్పుకున్న పవన్ తర్వాత బీజేపీతో జట్టు కట్టి సనాతన ధర్మానికి మద్దతుగా నిలబడటం విమర్శలకు దారితీసింది. ఈ సిద్ధాంతాల గందరగోళాన్ని కొందరు తప్పుబట్టినా అభిమానులు మాత్రం ఆయన అండగా ఉంటూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజీ మాత్రం తగ్గలేదు. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో టీడీపీ వెనుకబడినప్పటికీ… పవన్ మాత్రం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఆయన ధైర్యానికి అభిమానులు ఫిదా అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు భరోసా కల్పించింది కూడా పవర్ స్టారే.

హ్యూమన్ టచ్ హెల్పింగ్ నేచర్…
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని అతి పెద్ద ఆకర్షణ ఆయన త్యాగ గుణం, ఇతరులను ఆదుకునే దాతృత్వం. తన సొంత అన్న నాగబాబు సినిమా నిర్మాణంలో కోట్ల రూపాయలు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు పవన్ తన ఆస్తులను అమ్మి అన్నను ఆదుకున్నారు. రేణు దేశాయ్ తో విభేదాలకు ప్రధాన కారణం ఇదే అని అభిమానులు అంటారు. అంతేకాదు కరోనా మహమ్మారి సమయంలో సినీ కార్మికులకు, రైతులకు కోట్లాది రూపాయల ఆర్థిక సాయం అందించిన ఉదంతాలు అనేకం. ఇలాంటి చర్యలు ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేశాయి. పవన్ కేవలం ఒక నటుడు, రాజకీయ నాయకుడే కాదు. ఆయన ఒక ఉద్యమం… ఒక శక్తి!

ఊరికే గొప్పోళ్ళు కారు: కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ, విజయనగరం
పవన్ కళ్యాణ్ క్రేజ్ వెనుక కేవలం సినిమాలే కాదు… ఆయన పోరాట లక్షణం ఒక కారణం. ఆవేశంతో కూడిన ఆయన ప్రసంగం లక్షలాది మంది యువతను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో వివాదాలు తలెత్తినప్పటికీ..‌. వాటిని అత్యంత హుందాగా పరిష్కరించుకున్నారు. దీంతో ఆయనపై వేలెత్తి చూపే పరిస్థితి లేదు. రాజకీయాల్లోనూ మచ్చ లేకుండా పనిచేస్తున్నారు. ఆయన గుండెల్లో వామపక్ష భావజాలం ఉంది. ఊరికే ఎవరూ గొప్పోళ్ళు కారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *