76/180 – వందే భారత్‌ వేగం వీక్… ప్రయాణీకుల చిరాక్

  • 180 కి.మీ. సామర్థ్యం…76 కి.మీ.కే పరిమితం
  • దేశవ్యాప్తంగా సగటు ప్రయాణ వేగం ఇంతే
  • పాత ట్రాకులతో హైటెక్‌ రైలు బలి
  • చార్జీలు మాత్రం విమాన టికెట్టుకు సమానం

సహనం వందే, హైదరాబాద్:
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశ సాంకేతిక సామర్థ్యానికి అద్దం పట్టాలని ఆశించినా ఆచరణలో నిరాశే మిగిలింది. గంటకు 180 కిలోమీటర్లు దూసుకెళ్లాల్సిన ఈ అత్యాధునిక రైలు ప్రస్తుతం కేవలం 76 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుస్తోంది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. విమాన ప్రయాణ అనుభూతిని ఇస్తుందన్న ప్రచారం కేవలం ఊహగానే మిగిలిపోయింది. ఈ రైలు వేగం తగ్గడానికి కారణం ఆ రైలు సామర్థ్య లోపం కాదు… దశాబ్దాల తరబడి పేరుకుపోయిన వ్యవస్థాగత వైఫల్యాలే. అత్యాధునిక కారును పాతకాలపు గ్రామీణ రహదారిపై నడిపించిన చందంగా… వందే భారత్‌ ప్రయాణం తయారైంది.

పాత ట్రాకులకు హైటెక్‌ రైలు బలి…
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అద్భుతమైన వేగాన్ని అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం దేశంలోని పాతబడిన రైల్వే ట్రాక్‌లు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ట్రాక్‌లు ఆధునిక రైళ్ల అధిక వేగాన్ని తట్టుకునే బలం, స్థిరత్వం కలిగి లేవు. రైలు సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లు ఉన్నా ట్రాక్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు వేగాన్ని బలవంతంగా పరిమితం చేయాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా కేవలం మెరిసే రైళ్లను ప్రవేశపెట్టడం వలన ప్రయోజనం ఏంటో రైల్వే శాఖ ఆలోచించాలి. రైలు సామర్థ్యం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం అంటే ప్రజాధనాన్ని పూర్తిగా వృథా చేయడమే.

సిగ్నలింగ్‌ సమస్య..‌.
రైళ్ల వేగవంతమైన సురక్షితమైన ప్రయాణానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ కీలకం. అయితే దేశంలోని రైలు మార్గాలలో ఇంకా పాతకాలం నాటి సిగ్నలింగ్‌ వ్యవస్థలే కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థలు వందే భారత్‌ వంటి హైటెక్‌ రైళ్లకు అవసరమైన రియల్‌-టైమ్‌ ట్రాకింగ్‌, ఆటోమేటెడ్‌ నియంత్రణను అందించలేవు. ఆధునిక రైళ్లు వేగంగా వెళ్లాలంటే సిగ్నలింగ్‌ కూడా అంతే వేగంగా కచ్చితంగా పనిచేయాలి. ఆ సౌకర్యం లేకపోవడం వల్ల రైలు వేగం పరిమితమై ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు… వ్యవస్థ ఆధునికీకరణపై రైల్వే శాఖకు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించే అంశం.

సౌకర్యాలు అద్భుతం… ఫలితం సున్నా
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులకు కల్పించిన అత్యాధునిక సౌకర్యాలు, వై-ఫై, వినోద వ్యవస్థలు అన్నీ ప్రశంసనీయమే. అయితే ప్రయాణీకులు ఈ రైలు నుండి ఆశించేది మొదట వేగం, సమయపాలన. అది లేకుండా కేవలం సౌకర్యాల పేరుతో హైటెక్‌ రైలును నడపడం కేవలం ప్రచార హంగామాగా మిగిలిపోయింది. రైలు వేగం సామాన్య రైలుకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నప్పుడు… అధిక ధర చెల్లించి ప్రయాణీకులు ఈ రైలును ఎందుకు ఎంచుకోవాలి? ఒకవైపు అత్యాధునిక రైలును ప్రవేశపెట్టి మరోవైపు దాని సామర్థ్యాన్ని వినియోగించుకోలేని వైఫల్యం రైల్వే శాఖది.

పరిష్కారం తక్షణమే కావాలి
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేవలం ఒక అద్భుతమైన ఆలోచనగా మిగిల్చకుండా దాన్ని భారత రైల్వే ఆధునికీకరణకు చిహ్నంగా నిలబెట్టాలంటే మౌలిక సదుపాయాల మెరుగుదల తక్షణ అవసరం. రైల్వే ట్రాక్‌ల నవీకరణ, సిగ్నలింగ్‌ వ్యవస్థల ఆధునికీకరణ కోసం రైల్వే శాఖ పెద్ద ఎత్తున త్వరితగతిన పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే ఈ రైళ్లు భారతదేశ రైల్వే వ్యవస్థలోని నిర్లక్ష్యం, వైఫల్యాలకు శాశ్వత చిహ్నంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *