- బాలికల హాస్టల్ లో అప్పలనాయుడు సందడి
- ఆత్మీయ అనుబంధం… ఏటా వారితో సంబరం
సహనం వందే, రణస్థలం:
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రతి ఏటా ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థినులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆయన స్వతహాగా పిల్లలతో గడపడానికి, వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చూసి మురిసిపోవడానికి ఎంతో ఇష్టపడతారు. వారికి కావాల్సినవన్నీ చేసిపెట్టడం, అడగకముందే అవసరాలను తీర్చడం ఆయన సహజ శైలి. ఈ మానవీయ కోణం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకతను చాటుతోంది.
సొంత బిడ్డతో వచ్చి తీపి పంచిన ఎంపీ
సోమవారం దీపావళి రోజున ఎంపీ తన గారాలపట్టి నిఖిల నాయుడుతో కలిసి రణస్థలం హెడ్ క్వార్టర్స్‌లోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలివచ్చారు. చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి వారితో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వసతి గృహం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. బాలికల మనసుల్లో ఎంపీ, ఆయన కుమార్తె నిఖిల నాయుడు తమ ఆప్యాయతతో అనందాన్ని నింపారు.
ప్రతి జీవితం వెలుగుమయం కావాలి…
ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ… ‘ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఎక్కడున్నా సమయం కేటాయించి ఈ బాలికల గృహంలో విద్యార్థినులతో గడపడం, వారితో పాటు సంబరాలు చేసుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంద’ని అన్నారు. దీపావళి అనేది చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా తమ జీవితాల్లో ఉన్న చీకటిని, చెడును ప్రారదోలి వారి జీవితాలన్నీ దీపావళి కాంతుల లాగే వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అక్కడున్న అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.