- హైదరాబాదు మహానగరంలో మహా విషాదం
- దానధర్మాలు చేసే వారు ఎక్కడికి పోయారు?
- సోషల్ మీడియాలో.. ఇంటర్వ్యూలలో కబుర్లు
- ట్రస్టులు సమాజ సేవ అంటూ డప్పులు
- కలియుగంలో మానవత్వం కరువైన మనిషి
సహనం వందే, హైదరాబాద్:
దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం మానవత్వం మీద ఒక ప్రశ్నాస్త్రాన్ని సంధించింది.

కార్పొరేట్ శిఖరాల నీడలో పేదరికం
లక్షల కోట్ల ఆస్తులు, ప్రపంచస్థాయి ఐటీ హబ్‌లతో హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు, వ్యాపారవేత్తల నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. ఈ ఖరీదైన రంగుల ప్రపంచంలోనే ఒక వృద్ధురాలు భిక్షాటన చేస్తూ ఆకలితో చనిపోవడం ఈ నగరపు అభివృద్ధికి అద్దం పడుతున్న వికృత దృశ్యం. పోలీసుల వివరాల ప్రకారం ఆమె ఒంటరిగా జీవిస్తూ దినదిన గండంగా బతికేదట. వేల కోట్లు విలువ చేసే ఆస్తుల మధ్య, విలాసవంతమైన జీవనశైలికి నెలవైన ప్రాంతంలో ఈ మహిళ చివరి క్షణాల ఆకలి కేకలు ఎవరి చెవినీ చేరలేదా? మహానగర ప్రగతి రేట్లు గణనీయంగా పెరిగినా, ఆహార భద్రత అనే ప్రాథమిక హక్కుకు నోచుకోని దారిద్ర్య దృశ్యాలు ఇంకా తగ్గకపోవడం పాలనా వైఫల్యాలను, సామాజిక అంతరాలను కళ్లకు కడుతోంది.
కనుమరుగవుతున్న మానవత్వం…
వందల కోట్లు సంపాదించిన వ్యాపారవేత్తలు, ఐటీ ప్రముఖులు వేల సంఖ్యలో ఉన్న ఈ మహానగరంలో కొందరు తామే గొప్ప దాతలమని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసుకుంటారు. టీవీ ఇంటర్వ్యూలలో తమ దానధర్మాల గురించి గొప్పలు చెబుతారు. సమాజ సేవ కోసం ట్రస్టులు పెట్టి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? వారి కళ్ల ముందే ఒక అభాగ్యురాలు ఆకలి తీరక చనిపోవడం ఎవరినీ కదిలించలేదా? హైదరాబాద్‌లో ప్రతిరోజూ వేలాది మంది వృద్ధులు, ఒంటరి మహిళలు భిక్షాటన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, ఆహార భద్రత వంటి ఎన్నో పథకాలను ప్రకటిస్తున్నా ఏమిటీ దుస్థితి? కలియుగంలో మానవత్వం లేని మనిషి రాక్షసుడయ్యాడు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 102వ స్థానం…
గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2025 నివేదికలో భారతదేశం 123 దేశాల్లో 102వ స్థానంలో ఉండటం... తెలంగాణలో పిల్లల్లో స్టంటింగ్ వంటి ఆహార కొరత ఉండటం ఈ మహా సమస్యకు నిదర్శనం. అధికారిక రికార్డులు చావుల కారణాలను దాచిపెడుతున్నా… ఈ వృద్ధురాలి కళ్లలో కనిపించిన ఆకలి, మనుషుల మొహాల్లో కనిపించని మానవత్వం మనందరినీ ఆలోచింపజేయాలి. ప్రతిరోజూ 4500 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఆకలితో చనిపోతున్న దేశంలో కమ్యూనిటీ కిచెన్లు, ఆహార పంపిణీలో సమూల మార్పులు రాకపోతే మన ప్రగతి కేవలం అంకెల గారడీ మాత్రమే అవుతుంది. ఆకలి చావులు ఆగినప్పుడే ఇలాంటి దీపావళి వెలుగులకు నిజమైన అర్థం.
సమాచారం అందించండి: పోలీసులు
ఈ వృద్ధురాలి గుర్తింపు ఇంకా తెలియకపోవడంతో ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే చందానగర్ పోలీస్ స్టేషన్‌కు 9490617118 లేదా 8712663184 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.