- టెన్షన్ పడకండి… వందేళ్లు జీవించండి
- ఆమె దీర్ఘాయుష్షుపై శాస్త్రవేత్తల పరిశోధన
- సాధారణ జీవితం… సానుకూల దృక్పథం
- కరోనా వంటి రెండు మహమ్మారులపై ఫైట్
సహనం వందే, స్పెయిన్:
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గుర్తింపు పొందిన మరియా బ్రాన్యాస్ మొరెరా 117 ఏళ్ల 168 రోజుల బతికి గత ఏడాది కన్నుమూశారు. ఆమె 1918 ఫ్లూ మహమ్మారిని తట్టుకున్నారు. అలాగే కరోనా నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు. ఆమె చిరకాలం బతకడానికి గల రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ మానెల్ ఎస్టెల్లర్ నేతృత్వంలో జరిగిన ఈ అపూర్వ అధ్యయనం మరియా జీవన మంత్రంలోని కీలక అంశాలను ప్రపంచానికి చాటింది. ఆమె దీర్ఘాయుష్షు కేవలం అదృష్టం కాదని… దానికి వెనుక పటిష్టమైన జీవనశైలి, అసాధారణ జన్యు బలం ఉన్నాయని ఈ పరిశోధన నిరూపించింది.
ఆరోగ్యానికి ‘జన్యు’కవచం…
మరియా జుట్టు, లాలాజలం, రక్తం వంటి నమూనాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఆమె జన్యువుల్లో అద్భుతమైన ప్రత్యేకతలను గుర్తించారు. కొలెస్ట్రాల్, డిమెన్షియా, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించే ప్రత్యేక జన్యు వేరియంట్లు ఆమె జీనోమ్‌లో ఉన్నాయని తేలింది. ఆమె కణాలు ఆమె వాస్తవ వయసుకంటే తక్కువ చూపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రక్తంలో లిపిడ్ స్థాయిలను తక్కువగా ఉంచే జన్యు వేరియంట్లు ఆమె గుండె, మెదడును దృఢంగా ఉంచాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమయ్యే జన్యుపరమైన ప్రమాదాలు ఆమెలో లేకపోవడం మరొక విశేషం. అంతేకాకుండా ఆమె జీవక్రియ (మెటబాలిజం) అత్యంత సమర్థవంతంగా పనిచేయడం వల్ల కొవ్వు స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధన స్పష్టం చేసింది.
బలంగా రోగనిరోధక వ్యవస్థ
మరియా దీర్ఘాయుష్షు వెనుక ఆమె మెదడు, గుండె మాత్రమే కాదు ఆమె గట్‌లో ఉన్న మైక్రోబయోమ్ కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఆమె పేగులోని బ్యాక్టీరియా వయసులో ఉన్నవారి మాదిరిగా ఉంది. శరీరంలో వాపును (ఇన్‌ఫ్లమేషన్) తగ్గించింది. వయసు పెరిగే కొద్దీ సాధారణంగా తగ్గే బిఫిడోబాక్టీరియం వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, యాక్టినోబాక్టీరియోటా వంటి యాంటీ ఏజింగ్ గుణాలు గల బ్యాక్టీరియా ఆమెలో అధికంగా ఉండటం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రతిరోజూ ఆమె మూడు యోగర్ట్‌లు తినడం వల్ల ఈ బ్యాక్టీరియా స్థాయిలు పెరిగాయని అంచనా. ఈ అంతర్గత బలం కారణంగానే ఆమె రోగనిరోధక వ్యవస్థ కూడా వృద్ధాప్యంలో సమర్థవంతంగా పనిచేయగలిగింది. ఎపిజెనెటిక్ క్లాక్ ప్రకారం… మరియా జీవసంబంధ వయసు ఆమె అసలు వయసు కంటే సుమారు 23 సంవత్సరాలు తక్కువగా ఉంది.
సాధారణ జీవితం… సానుకూల దృక్పథం
కేవలం జన్యువులు మాత్రమే కాదు మరియా జీవనశైలి కూడా ఆమెకు దీర్ఘాయుష్షును ప్రసాదించింది. ఆమె జీవితం సరళంగా, క్రమశిక్షణతో కూడి ఉంది. మెడిటరేనియన్ ఆహారం తీసుకోవడం… మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం ఆమె ఆరోగ్యానికి పునాదులు వేశాయి. డాక్టర్ ఎస్టెల్లర్ తెలిపిన ప్రకారం… మరియా తన జీవితాన్ని నిరాడంబరంగా, సానుకూల దృక్పథంతో కొనసాగించడం దీర్ఘాయుష్షుకు ముఖ్య కారణం. ఒత్తిడిని దరిచేరనీయకుండా సామాజిక సంబంధాలను గట్టిగా నిలుపుకోవడం ఆమె జీవన రహస్యంలో భాగమని తేలింది. ఆమె జీవితంలోని సవాళ్లను ధైర్యంగా, సానుకూలంగా స్వీకరించడం వల్లే ఇన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలిగారని పరిశోధక బృందం నమ్ముతోంది.
మెడిటరేనియన్ ఆహారం అంటే?
మెడిటరేనియన్ ఆహారం అనేది ప్రాథమికంగా మొక్కల ఆధారిత ఆహారం. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, గింజలు, ఆలివ్ నూనె ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు చేపలు, తక్కువ మొత్తంలో పాల ఉత్పత్తులు… ఎర్ర మాంసం… అప్పుడప్పుడు తక్కువ మొత్తంలో రెడ్ వైన్ కూడా ఉంటాయి.