భరించలేం… బతకలేం – కొండపై నుంచి దూకిన 9వ తరగతి బాలికలు

  • ఒకరు మృతి… మరొకరు ఆసుపత్రి పాలు
  • సూసైడ్ నోట్ లో భరించలేని బాధ అనే వాక్యం
  • కేరళ మారుతిమల కొండపై జరిగిన దారుణం
  • హృదయాలను పిండేస్తున్న ఆత్మహత్య

సహనం వందే, కేరళ:
కేరళలో మారుతిమల కొండపై జరిగిన దారుణం అందరి హృదయాలను పిండేస్తుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు మనసు కకావికలమై వెయ్యి అడుగుల ఎత్తున్న కొండపై నుంచి దూకగా ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్నేహం, చదువు, కలలతో కళకళలాడాల్సిన ఆ చిన్న హృదయాలను ఆత్మహత్యకు పురిగొల్పేంతటి క్రూరమైన ఒత్తిడి, ఆవేదనను ఎవరు కలిగించారు? వారి మౌనం వెనుక దాగిన బాధే ఈ విషాదానికి కారణమని అర్థం అవుతుంది.

అబద్ధాలు చెప్పి ఆత్మహత్య వైపు అడుగులు…
మీను, శివర్ణ శనివారం పాఠశాలలో సాంస్కృతిక పోటీలలో పాల్గొంటామని తల్లిదండ్రులకు చిన్న అబద్ధం చెప్పి ఇంట్లోంచి బయలుదేరారు. తర్వాత తమ కుమార్తెలను చూడాలని పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులకు వారు కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. మీను ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ భయం మరింత పెరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొండపై దాగిన దారుణం…
పూయప్పల్లి ప్రాంతంలో మీను ఫోన్ చివరి సిగ్నల్ ఆధారంగా పోలీసులు మారుతిమల కొండ వైపు పరుగెత్తారు. సాయంత్రం 5.45 గంటలకు సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న కన్నడిపర కొండపై నుంచి ఆ ఇద్దరు బాలికలు దూకారు. ఆ క్షణంలో వారి హృదయాలు ఎంతగా విలపించాయో ఎవరూ ఊహించలేరు. భద్రతా కంచెను దాటి కొండపైకి వెళ్తున్న వారిని స్థానికుడు విష్ణుదత్ అనే వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినా అప్పటికే ఆలస్యమైంది. మీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, శివర్ణ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది.

గుండెను గాయం చేసిన ‘సూసైడ్ నోట్’
ఆ కొండపై దొరికిన సూసైడ్ నోట్ ఈ దారుణమైన కథలోని అత్యంత విషాదకరమైన భాగం. ఆ చిన్న కాగితంపై బాలికలు రాసిన పదాలు వారు భరించలేని బాధకు, ఒత్తిడికి నిదర్శనం. ‘భరించలేని బాధ’ అనే ఒకే ఒక్క వాక్యం వారిని ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ బాధ ఏమిటి? వారిపై శారీరక, మానసిక వేధింపులు ఏమైనా జరిగాయా? స్కూల్లో, ఇంట్లో లేదా స్నేహితుల మధ్య ఏదైనా ఘోరమైన సంఘటన జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాలిక కళ్ళు తెరిస్తే కానీ అసలు విషయం బయటపడదు. అలాగే చనిపోయిన బాలిక పోస్టుమార్టం రిపోర్టు ద్వారా వివరాలు తెలిసే అవకాశం ఉంది.

పెరుగుతున్న యువత ఆత్మహత్యల రేటు…
మీను వయసు పద్నాలుగేళ్లు, శివర్ణ పదిహేడేళ్లు. వారి కుటుంబాలలో ఎలాంటి సమస్యలు లేవని శివర్ణ తండ్రి సుకు కన్నీటితో చెబుతున్నారు. ఈ ఘటన దేశంలో యువత ఆత్మహత్యల రేటు పెరుగుదలకు అద్దం పడుతోంది. మానసిక ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒత్తిడులు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎదురవుతున్న సమస్యలు, సైబర్‌ వేధింపులు వంటి అంశాలు ఈ దారుణానికి పరోక్ష కారణాలు కావచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *