- నినాదాలతో హోరెత్తుతున్న అమెరికా
- రోడ్లపైకి వచ్చి ట్రంప్ ‘రాజరికం’పై తిరుగుబాటు
- అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ‘నో కింగ్స్’ పోరాటం
- 2700 పట్టణాలు, నగరాల్లో నిరసన వెల్లువ
- నేపాల్ ‘జెన్ జడ్’ జెండాలు ప్రత్యక్షం
సహనం వందే, అమెరికా:
అమెరికా అల్లకల్లోలంగా మారింది. 2700 పట్టణాలు, నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ విధానాలపై గళమెత్తుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ట్రంప్ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. గత జూన్‌లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయగా… ఇప్పుడు దాదాపు నాలుగింతల మంది నిరసనలు చేయడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. వాషింగ్టన్ నుంచి చిన్న చిన్న పట్టణాల వరకు 2700కు పైగా ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాలతో అమెరికాను దెబ్బతీస్తున్నారంటూ ప్రజలు రోజురోజుకూ ఉద్రిక్తులవుతున్నారు. విచిత్రం ఏంటంటే నేపాల్ లో ఇటీవల జరిగిన జెన్ జెడ్ ఉద్యమంలో పట్టుకున్న జెండాలు ప్రత్యక్షం కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇతర దేశాల్లోనూ అమెరికాపై వ్యతిరేక పోరాటాలు
ఈ నిరసన ప్రదర్శనలు అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. రోమ్‌లో డెమోక్రట్స్ అబ్రాడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో ఇటలీ పౌరులు పాల్గొని ట్రంప్ విధానాలు ప్రపంచ ఆర్థిక సామాజిక రంగాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. బెర్లిన్‌లో అమెరికా రాయబారి కార్యాలయం ముందు జర్మనీ ప్రజలు అమెరికా ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచారు. టొరాంటోలో కెనడా రాజకీయ నాయకులు సైతం ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించారు. రాజులు లేని దేశంలో ప్రజలే రాజులు అవ్వాలనే బలమైన సందేశం ఈ అమెరికా విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల సారాంశం.