- డీసీసీబీ బ్యాంకుల్లో 225 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీ
- వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు
- ప్రారంభ జీతం 47 వేల రూపాయలు…
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాల వారీగా ఖాళీలు
ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99 ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మెదక్, వరంగల్‌లలో 21 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 9 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 225 ఖాళీలలో 25 శాతం పోస్టులు ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
అర్హతలు, వయోపరిమితి వివరాలు
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి వరకు తెలుగు భాష చదివి ఉండడం తప్పనిసరి. ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోసడలింపు లభిస్తుంది. తెలంగాణ స్థానికులైనవారు మాత్రమే అర్హులు. కనీసం నాలుగేళ్ల చదువు లేదా నివాసం తెలంగాణలో ఉండాలన్నది ప్రధాన షరతు.
ప్రారంభ జీతం 47 వేల రూపాయలు…
ఈ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రారంభంలోనే నెలకు 47 వేల రూపాయల జీతం అందుతుంది. ఈ ఉద్యోగాల జీత శ్రేణి 24 వేల 50 రూపాయల నుంచి 64 వేల 480 రూపాయల వరకు ఉంటుంది. డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం, వైద్య రీయింబర్స్‌మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి సౌకర్యాలు అదనంగా లభిస్తాయి. ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి ఉన్నత పదోన్నతులు కూడా సాధించవచ్చు.
ఇంటర్వ్యూ లేకుండా ఆన్‌లైన్ పరీక్షతో ఎంపిక
ఈ ఉద్యోగాల ఎంపిక పూర్తిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ విధానం లేదు. ఈ కీలక పరీక్షను డిసెంబర్ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పరీక్షలో జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఆంగ్ల భాష, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రతి సెక్షన్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి.
దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ…
ఆక్టోబర్ 18 నుంచి నవంబర్ 6 వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ వర్గానికి వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఫోటో, సంతకం, బొటనవేలు ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ఒక అభ్యర్థి ఒకే జిల్లా బ్యాంకుకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది.
సహకార బ్యాంకు ఉద్యోగుల బాధ్యతలు
స్టాఫ్ అసిస్టెంట్లు ప్రధానంగా కస్టమర్లకు సేవలు అందించడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఖాతాల నిర్వహణ వంటి ముఖ్యమైన పనుల్లో పాల్గొంటారు. సహకార బ్యాంకులు లాభం కంటే సేవకు ప్రాధాన్యం ఇవ్వడం వీటి ప్రత్యేకత. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ ప్రతి సభ్యుడికి సమాన ఓటింగ్ హక్కు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల కాంట్రాక్ట్ బాండ్, ఒక సంవత్సరం ప్రోబేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.