- 77వ స్థానం నుంచి 85కు దిగజారుడు
- వీసా లేకుండా 12 దేశాలకు వెళ్లొచ్చు
- 27 దేశాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం
- మరో 44 దేశాలతో ‘ఈ-వీసా’ సౌకర్యం
- హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2025 వెల్లడి
సహనం వందే, లండన్:
అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి… చివరికి ఈ ఏడాది మళ్లీ 85వ స్థానానికి పతనం కావడం అంతర్జాతీయ దౌత్య సంబంధాల ఒడిదొడుకులను స్పష్టం చేస్తోంది.
ర్యాంకు పతనంతో అప్రతిష్ట…
ర్యాంకు పతనం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అనేక దేశాలు వీసా నిబంధనలను మరింత కఠిన తరం చేస్తాయి. దీనివల్ల వివిధ రకాల వాణిజ్య ఆర్థిక ఒప్పందాలు కష్టతరమవుతాయి. ఫలితంగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మిగిలిన దేశాలకు వెళ్లాలంటే కష్టం అవుతుంది. ఈ పరిస్థితులు వ్యాపారం, సాంకేతికత, విద్యా రంగాల్లో అవకాశాలు తగ్గుతాయి.
మనకు వీసా అక్కర్లేని దేశాలు ఏవో తెలుసా?
ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు భూటాన్, డొమినికా, హైతీ, ఇండోనేసియా, మారిషస్, మైక్రోనేసియా, నేపాల్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనౌటు సహా మొత్తం 12 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
27 దేశాలకు వీసా ఆన్ అరైవల్…
ఇక విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వీసా జారీ (వీసా ఆన్ అరైవల్) చేసే సౌకర్యాన్ని 27 దేశాలు మనకు కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో శ్రీలంక, మాల్దీవులు, జోర్డాన్, కతార్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతోపాటు బొలీవియా, బురుండీ, కంబోడియా, కేప్ వెర్డే ఐలాండ్స్, కొమొరో ఐలాండ్స్, జిబౌటీ, ఇథియోపియా, గినియా-బిస్సావు, లావోస్, మడగాస్కర్, మార్షల్ ఐలాండ్స్, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, నియూ, పలావు ఐలాండ్స్, సమోవా, సియెర్రా లియోన్, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, టోగో, టువాలు వంటి దేశాలు కూడా ఉన్నాయి.
ఆన్‌లైన్ వీసా ఇచ్చే దేశాలు…
మరో 44 దేశాలు ఈ-వీసా సౌకర్యం ఇస్తుండగా… అందులో అజర్‌బైజాన్, సౌదీ అరేబియా, టర్కియే, వియత్నాం ప్రముఖమైనవి. వీసా ఆన్‌లైన్‌లో పొందేందుకు అల్బేనియా, ఆర్మేనియా, బహమాస్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, జార్జియా, హాంకాంగ్, ఒమన్, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, జాంబియా వంటి దేశాలు ఉన్నాయి. కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ వంటి కొన్ని దేశాలు ఈటీఏను (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) తప్పనిసరి చేశాయి.
అమెరికా పతనం… సింగపూర్ అగ్రస్థానం
సింగపూర్ 193 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో మొదటి స్థానంలో నిలవగా… దక్షిణ కొరియా 190, జపాన్ 189 దేశాలతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో ఒకటిగా వెలుగొందిన అమెరికా పాస్‌పోర్ట్ ఈ ఏడాది గట్టిగా దెబ్బ తింది. అమెరికా ర్యాంకు ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. 2014లో టాప్-1లో ఉన్న పాస్‌పోర్ట్‌గా ఉన్న అమెరికా… ప్రస్తుతం మలేషియాతో సమానంగా కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశం లభిస్తోంది. అమెరికా పాస్‌పోర్ట్ బలం తగ్గడం ప్రపంచంలో వస్తున్న మార్పును సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.