- అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద టాస్క్ ఫోర్స్ హల్చల్
- పోలీసులపై సురేఖ కూతురు సుస్మిత ఫైర్
- తమ కుటుంబంపై రెడ్డీల కుట్ర ఉందని విమర్శ
- మంత్రి సురేఖ మంత్రి మండలిలో కొనసాగిస్తారా? లేదా?
సహనం వందే, హైదరాబాద్:
సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. సుమంత్ హుజూర్ నగర్‌లో డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్ పెట్టి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సుమంత్‌ను తొలగించింది. సుమంత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడంపై సురేఖ కుమార్తె కొండ సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బీసీలను చేరదీస్తుంటే… తెలంగాణలో మాత్రం తమ కుటుంబంపై రెడ్డీలు కుట్ర చేస్తున్నారని సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇంటికి ఏకంగా పోలీసులు వెళ్ళడంతో ఆమె క్యాబినెట్లో కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రిపై కూతురు ఆరోపణ…
సుమంత్ కేవలం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రోహిన్ రెడ్డి చెప్పడంతోనే మాట్లాడి వచ్చాడని… అదొక్కటే తమ తప్పని సుస్మిత ఆరోపించారు. చిన్న విషయంపై కేసు పెట్టి అర్ధరాత్రి తమ ఇంటికి పోలీసులు వచ్చి తమ తల్లిని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె గట్టిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉండడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నిస్తూ తమ కుటుంబం మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారని సుస్మిత నిలదీశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినప్పటికీ సుమంత్‌ను మంత్రి ఇంట్లోనే దాచిపెట్టారనే సమాచారం పోలీసులకు అందడంతోనే అర్ధరాత్రి పోలీసులు మంత్రి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటన కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, కుటుంబ రాజకీయాలను రచ్చ కీడ్చింది.
పోలీసులను నిలదీసిన సుస్మిత…
సుమంత్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత తీవ్రంగా అడ్డుకున్నారు. ‘మా ఇంటికి రావడానికి మీకెంత ధైర్యం’ అంటూ ఘాటుగా వాదించారు. ప్రభుత్వంలో భాగమైన ఒక మంత్రి నివాసానికి ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు వచ్చారని విమర్శకులు అంటున్నారు. ఈ రకంగా పోలీసులు మంత్రి ఇంటిని లక్ష్యంగా చేసుకోవడం సురేఖపై జరిగిన రాజకీయ దాడి మాత్రమే కాదు… కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలకు స్పష్టమైన సంకేతం. ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతుండడంతో పార్టీ అధిష్ఠానం కూడా వర్గ పోరుపై ఆందోళన చెందుతోంది.
సురేఖ వివాదాల చరిత్ర!
సురేఖకు వివాదాలు కొత్తేమీ కాదు. ఆమె రాజకీయ జీవితం అనేక విమర్శల మలుపులతో నిండి ఉంది. గత ఏడాది సమంత, నాగ చైతన్య విడాకులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని ఆమె చేసిన ఆరోపణలు దేశవ్యాప్త కలకలం సృష్టించాయి. దీనిపై నాగార్జున, కేటీఆర్ పరువు నష్టం కేసులు దాఖలు చేసి కోర్టుకు కూడా హాజరయ్యేలా చేశారు. అలాగే ఆగస్టులో రాష్ట్రపతి ద్రౌపది మూర్ముపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా విమర్శలు తెచ్చిపెట్టాయి. ఈ వరుస వివాదాలు ఆమె రాజకీయ వ్యాఖ్యలు పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
టెండర్ల రచ్చ… మంత్రుల మధ్య యుద్ధం!
పార్టీలో అంతర్గత గొడవలకు నిదర్శనంగా, ఇటీవల దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో మంత్రి సురేఖ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఘర్షణ పడ్డారు. రూ.71 కోట్ల విలువైన ఈ పనులకు పొంగులేటి తన అనుచరుల సంస్థలకు టెండర్లు కట్టబెట్టాలని చూస్తున్నారని, తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఏకంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ విభేదాల కారణంగానే సురేఖ పొంగులేటి అధ్యక్షత వహించిన సమీక్షా సమావేశాలకు దూరమయ్యారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న వర్గ రాజకీయాలను బట్టబయలు చేసింది.