- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షం దాడి
- దారుణమైన రోడ్ల వల్లే కంపెనీలు దూరం
- లోకేశ్ స్పందన… కర్ణాటకకు సూచన
సహనం వందే, అమరావతి:
విశాఖపట్నంలో ‘గూగుల్’ ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ఉన్న అత్యంత దారుణమైన రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వ్యాపార వర్గాలను విసిగించాయని… అందుకే గూగుల్ సంస్థ విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిందని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే బెంగళూరు తన వ్యాపార సౌహార్ద్రతను కోల్పోయి అంతర్జాతీయ పోటీలో వెనుకబడిందని కన్నడ పార్టీలు ఘాటుగా విమర్శించాయి.
లోకేశ్ స్పందన… కర్ణాటకకు సజెస్ట్
ఈ విమర్శల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందిస్తూ కర్ణాటక నాయకులకు ఘాటు సమాధానం ఇచ్చారు. ముందుగా ఆ రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ప్రభుత్వం ఉందని… ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే సామర్థ్యం ఉందని ఆయన గర్వంగా ప్రకటించారు.
ఏపీ భారీ సబ్సిడీలపై విమర్శల వెల్లువ…
కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ రాయితీలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీలు, అత్యంత చౌకకు భూమి, నీటి సరఫరా, ఉచిత విద్యుత్ ట్రాన్స్‌మిషన్, జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ఆంధ్రప్రదేశ్ ఇచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. ఇటువంటి భారీ ప్రోత్సాహకాలు దీర్ఘకాలికంగా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం కావొచ్చని ఆయన హెచ్చరించారు.
ఏఐ హబ్‌తో ఆంధ్రా దూకుడు…
గూగుల్ ఏఐ హబ్ విశాఖపట్టణంలో ఏర్పాటు కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక పెద్ద విజయమని పలువురు ఐటీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పెట్టుబడి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, యువతకు ఉద్యోగాల కల్పనకు భారీగా ఊతమిస్తుందని అంచనా. మరోవైపు కర్ణాటకలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, పాలనలోని లోపాల వల్ల బెంగళూరు నగరం తన సాంకేతిక రాజధాని హోదాను క్రమంగా కోల్పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.