గూగుల్ డీల్… పవన్ ఫీల్ – పవర్ స్టార్ లేకుండానే అంతర్జాతీయ డీల్

  • ఢిల్లీలో గూగుల్ ఒప్పందం: బాబు, లోకేష్ షో
  • పవన్ ను దూరం పెట్టిన తండ్రీ కొడుకులు
  • అమరావతిలో సాదాసీదా కార్యక్రమంలో పీకే
  • లోకేష్ ను ఆకాశానికి ఎత్తిన సీఎం చంద్రబాబు
  • ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజకీయ రచ్చ

సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్రానికి అతి కీలకమైన, దేశంలోనే ప్రథమమైన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం కోసం మంగళవారం ఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం కూటమిలో విభేదాలను బహిర్గతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఈ చారిత్రక ఒప్పందానికి పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అనేక చిన్నపాటి ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ఇద్దరు నేతలు కలిసి వెళ్లే సందర్భాలు ఉన్నా… అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ కీలక ఒప్పంద సమయంలో పవన్ ను దూరం పెట్టడం కేవలం యాదృచ్ఛికం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆయన ఢిల్లీకి రాకుండా అమరావతిలో అత్యంత సాదాసీదా సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.

లోకేష్‌ పైకి… పవన్‌ కిందకి
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు హైదరాబాద్ హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులంత కీలకమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంతటి కీలక ఒప్పందం క్రెడిట్ మొత్తం తన కుమారుడు, మంత్రి లోకేష్ ఖాతాలో వేసేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని విమర్శలు వస్తున్నాయి. ఈ డాటా సెంటర్ రాకలో లోకేష్ పాత్రే కీలకమైందని చంద్రబాబు బహిరంగంగా కితాబు ఇచ్చారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ ఒప్పందానికి లోకేషే ప్రధాన సారథి అని చాటిచెప్పడం ద్వారా లోకేష్ పరపతిని ఢిల్లీ వేదికగా పెంచారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు ఈ క్రెడిట్ దక్కకుండా వ్యూహాత్మకంగా దూరంగా ఉంచారన్నది రాజకీయ విశ్లేషణ. కూటమిలో ఉన్నా పవన్ ను కీలకమైన జాతీయ వేదికలపై జొరబడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అమరావతి సమీక్షలకే పరిమితమా?
గూగుల్-అదానీ భాగస్వామ్యంతో విశాఖలో ఏర్పడబోయే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్యాంపస్‌ను చంద్రబాబు దేశానికే తలమానికంగా అభివర్ణించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఇది కీలక మార్పులు తెస్తుందని, ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి ఇటువంటి భారీ పెట్టుబడులు అవసరమని ప్రకటించారు. ఇంతటి భారీ కార్యక్రమం జరుగుతుంటే కూటమిలో రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడైన పవన్ కళ్యాణ్ కేవలం అమరావతిలో సమీక్షా సమావేశాలకు పరిమితమవ్వడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకే ఆయనను పరిమితం చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ దక్కే వేదికలకు దూరం పెడుతున్నారనే అనుమానాలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చింది.

రాజకీయ లెక్కల్లోనే పవన్ గైర్హాజరు…
నిజానికి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఈ ఒప్పందం వెనుక చంద్రబాబు-లోకేష్ పాత్రనే హైలైట్ చేయడం, పవన్ రాకపోవడం.. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది నెలలు కూడా కాకముందే, ప్రధాన నాయకుల మధ్య అధికార, ప్రాధాన్యత విషయంలో ఇటువంటి విభేదాలు బయటపడటం సందేహాలను పెంచుతోంది. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను అతిపెద్ద ఆర్థిక విజయానికి సంబంధించిన వేదికకు దూరం పెట్టడం అంటే, కూటమిలో ఆయన పాత్రను చిన్నది చేసే ప్రయత్నమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *