జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

  • నామినేషన్ల హోరు… బీసీ రిజర్వేషన్లపై పోరు
  • 18వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు
  • ఇక నామినేషన్లతో వివిధ వర్గాల నిరసన
  • నిరుద్యోగులు మొదలు… కుల సంఘాల దాకా
  • వందల సంఖ్యలో నామినేషన్లు వేసేలా స్కెచ్
  • అధికార పార్టీకి గుబులు రేపుతున్న ఎలక్షన్

సహనం వందే, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ కీలక నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

300 మంది పోటీకి నిరుద్యోగుల నిర్ణయం…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైందంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని నిరసనను ఉధృతం చేశారు. ‘మేం 300 మంది నామినేషన్లు వేస్తాం… కాంగ్రెస్ ను ఓడిస్తాం’ అంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు

ప్రకటించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క సాధారణ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని నిరుద్యోగ నేతలు విమర్శించారు. గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని తీర్మానించారు.

‘మాలల పంతం-కాంగ్రెస్ అంతం’
ఎస్సీ వర్గీకరణ పేరుతో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఈ ఉపఎన్నికలో పోటీకి సిద్ధమైంది. ఏకంగా 200 మంది మాల సంఘాల ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వర్గీకరణ పేరుతో ఎస్సీల్లోని 58 కులాలకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ… ‘మాలల పంతం-కాంగ్రెస్ అంతం’ అన్న నినాదంతో ముందుకు సాగుతామని జేఏసీ నేతలు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లపై 18న బంద్…
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని సీపీఐ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్ర శాసనసభలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన బీజేపీ కేంద్రంలో మాత్రం గవర్నర్ వద్ద పెండింగ్‌లో పెట్టి అడ్డుకుంటోందని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ నెల 18న బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు కూడా సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్రం వెంటనే ఈ బిల్లును ఆమోదించాలని, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి సీపీఎం పిలుపునిచ్చింది.

నిరుద్యోగుల గొంతు… కవిత అరెస్టుపై ఉద్రిక్తత
గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. లైబ్రరీలోకి అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను నిలువరించగా జాగృతి నాయకులు ఆగ్రహంతో లైబ్రరీ గేటును బద్దలు కొట్టారు. ఈ సంఘటన రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పెరుగుతున్న పోరాటాన్ని, దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది. ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పెనుసవాలుగా మారాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *