ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

  • కాలేయ మార్పిడి చికిత్స ఫెయిల్
  • అయినా రూ. 85 లక్షలు బిల్లు దోపిడి
  • మొత్తం కట్టాకే శవం ఇచ్చారని ఆరోపణలు
  • కుటుంబ సభ్యుల ఫైర్… పోలీసుల దర్యాప్తు

సహనం వందే, హైదరాబాద్:
పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం గత 45 రోజుల్లో ఏకంగా రూ. 85 లక్షలను ఆసుపత్రికి చెల్లించింది. డబ్బు చెల్లింపు ఆలస్యం కాకూడదనే దురుద్దేశంతో అతడు చనిపోయాడని చెప్పడానికి కొద్ది గంటల ముందు కూడా రూ. 14 లక్షలు కట్టించుకోవడం వైద్య వ్యాపారంలోని నిలువు దోపిడీని వెల్లడిస్తోంది. ఈ విషయంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

వయసు మార్పు వెనుక మోసం…
అధిక బిల్లుల వసూలే కాదు మురళీధర్ మృతి విషయంలో వైద్య నిర్లక్ష్యం మోసం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 40 ఏళ్ల మురళీధర్ వయస్సును ఆసుపత్రి సిబ్బంది రికార్డుల్లో 60 ఏళ్లుగా నమోదు చేశారని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనివల్ల జీవన్‌దాన్ పథకం కింద లివర్ డోనర్స్ ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఈ మోసపూరిత చర్యకు గల కారణాలపై జీవన్‌దాన్ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందా లేదా అనే అంశంపై అధికారులు, జీవన్‌దాన్ సంస్థ తక్షణమే విచారణ చేపట్టాలి. చివరికి భర్తను కాపాడుకోవడానికి భార్యే లివర్ దానం చేయడానికి ముందుకు రాగా ఆ ఆపరేషన్ జరిగిన కొద్దిసేపటికే మురళీధర్ మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మరణాన్ని దాచి… డబ్బు దోచి
ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు చూస్తుంటే మురళీధర్ రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు తెలుస్తోంది. బిల్లు పూర్తిగా వసూలు అయ్యేవరకు అతడి మరణ వార్తను గోప్యంగా ఉంచడంలోనే కార్పొరేట్ ఆసుపత్రుల నీతిమాలిన దోపిడీ అర్థమవుతోంది. ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయకుండా ప్రాణం లేని దేహాన్ని అప్పగించిన తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఏఐజీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *