- పర్యాటకం పేరుతో మహిళల లైంగిక దోపిడీ
- పేదలే సమిధలుగా మారుతున్న పరిస్థితి
- మానవ సంబంధాల దారుణమైన చీకటి కోణం
సహనం వందే, బ్యాంకాక్:
థాయ్‌లాండ్ పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న ఒక చీకటి ధోరణి ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పట్టాయా వంటి నగరాల్లో విదేశీ పర్యాటకులు తాత్కాలికంగా భార్యలను అద్దెకు తీసుకునే ఈ పోకడ ఆర్థిక అవసరాల పేరుతో మహిళలను వస్తువుల్లా మార్చే ప్రమాదకరమైన దోపిడీగా మారింది. రచయిత లావెర్ట్ ఎమ్మాన్యుయేల్ తన పుస్తకంలో బయటపెట్టిన ఈ అమానవీయ వాస్తవం ప్రపంచవ్యాప్తంగా సామాజిక నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది పర్యాటక వ్యాపారానికి ఆకర్షణగా మారినా మహిళల హక్కులను చిదిమేస్తున్న ఈ ధోరణి తీవ్ర విమర్శలకు గురవుతోంది.
తాత్కాలిక బంధం కాదు… ఆర్థిక బానిసత్వం
పట్టాయాలోని రెడ్‌లైట్ ఏరియాలు ఈ కొత్త తరహా దోపిడీకి కేంద్రాలుగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద మహిళలు కొద్ది రోజులు లేదా నెలల పాటు విదేశీ పర్యాటకులకు జీవిత భాగస్వామి పాత్ర పోషిస్తున్నారు. వంట చేయడం, ప్రయాణాల్లో తోడుగా ఉండటం, భార్యగా జీవించడం వంటివి ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం. చట్టబద్ధమైన వివాహం లేకుండా బార్‌లు, నైట్‌క్లబ్‌లలో పరస్పర ఒప్పందాలపై ఆధారపడి జరిగే ఈ వ్యవస్థ మహిళలను కేవలం ఒక వస్తువులా, అవసరానికి ఉపయోగపడే సరుకులా చూసే నీచమైన మానసికతను పెంచుతోంది. జపాన్, కొరియాలలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ హైర్ సేవల నుండి ప్రేరణ పొందినప్పటికీ… థాయ్‌లో ఇది ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది.
బేరమాడే వస్తువుగా స్త్రీ గౌరవం…
ఈ ప్రమాదకర వ్యాపారం ఆర్థికంగా వెనుకబడిన మహిళలను అదనపు ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకునేలా ఒత్తిడి చేస్తోంది. వయస్సు, అందం, విద్య ఆధారంగా అద్దె నిర్ణయించడం చూస్తుంటే మానవ సంబంధాల విలువ ఎంత దిగజారిందో అర్థమవుతోంది. ఒక నెలకు సుమారు లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కూడా రేట్లు ఉంటాయని కథనాలు చెబుతున్నాయి. ఇది ఇష్టపూర్వకంగా జరుగుతుందని చెబుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి కారణంగానే మహిళలు ఈ మార్గంలోకి వెళ్తున్నారని అర్థమవుతుంది. పర్యాటక వ్యాపారంలో భాగమైన ఈ చీకటి కోణం లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణాకు తలుపులు తెరుస్తున్నట్టే.
మహిళల భద్రత గాల్లో దీపం
ఈ తాత్కాలిక సంబంధాలపై ఎటువంటి చట్టపరమైన నియంత్రణ లేకపోవడం అతి పెద్ద సమస్య. పరస్పర అంగీకారం ఆధారంగా జరిగే ఈ వ్యవస్థ మహిళలను నిస్సందేహంగా దోపిడీకి గురి చేస్తోంది. చట్టపరమైన రక్షణ లేకపోవడంతో విదేశీయులు ఈ మహిళలను దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పోకడను సామాజిక మాధ్యమాలలో విమర్శకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇది కేవలం పాత రూపంలో ఉన్న మానవ వ్యాపారమేనని, మహిళల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి థాయ్ సమాజంలో దీర్ఘకాలిక సామాజిక, సాంస్కృతిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
కట్టడి చేయకుంటే మచ్చ తప్పదు
ఈ నయా ధోరణి వేగంగా విస్తరిస్తున్నట్టు థాయ్ ప్రభుత్వం అంగీకరించింది. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తక్షణమే నియంత్రణ చట్టాలు తీసుకురావాలని నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. చట్టపరంగా ఎలాంటి పట్టు లేని ఈ వ్యవస్థను నియంత్రించకపోతే ఇది మరింత దుర్మార్గాలకు దారితీస్తుంది. థాయ్‌లాండ్ పర్యాటక రంగం ఎంత గొప్పదైనా మానవ దోపిడీపై ఆధారపడిన ఇటువంటి ట్రెండ్‌లు దేశ ప్రతిష్ఠకు చెరగని మచ్చగా మారుతాయి. ప్రపంచ సమాజం ఈ ధోరణిని తీవ్రంగా విమర్శించి మహిళల హక్కుల రక్షణకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే మానవ సంబంధాల విలువ మరింత దిగజారడం ఖాయం.