- లైంగిక వేధింపులకు గురయ్యానంటూ నోట్
- రాజకీయస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ పార్టీ
- బీజేపీని ఇరుకున పెట్టిన ప్రియాంక గాంధీ
- సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్
- జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం
- ఆత్మరక్షణలో ఆర్ఎస్ఎస్, కాషాయం పార్టీ
సహనం వందే, న్యూఢిల్లీ:
కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో దేశ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ దారుణాలు తన ఓసీడీ, డిప్రెషన్‌కు కారణమయ్యాయని అతడు పేర్కొన్నాడు.

బీజేపీని ఇరుకున పెట్టిన ప్రియాంక…
ఈ సంచలన ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాస్త్రంగా మలచడంలో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో అనందు లాంటి వేలాది మంది పిల్లలు, యువకులు ప్రమాదంలో ఉన్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా హెచ్చరించారు. లైంగిక వేధింపులు అక్కడ విస్తృతంగా జరుగుతున్నాయని, ఈ ఆరోపణలు నిజమైతే దేశాన్ని వణికించే భయంకరమైన విషయమని ఆమె ఆరోపించారు.
కేవలం అనందు మాత్రమే కాదని అనేక మంది బాధితులు ఉన్నారని ఆమె పేర్కొనడం ఈ అంశానికి జాతీయస్థాయిలో తీవ్రతను పెంచింది. ఆర్ఎస్ఎస్ నాయకత్వం తక్షణమే స్పందించాలని, కేరళ టెక్కీ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆర్ఎస్ఎస్ పై జరిగిన మొదటి పదునైన రాజకీయ దాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ మౌనం…
అనందు అజి చేసిన అత్యంత తీవ్రమైన బాలల లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ అధికారికంగా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై సంస్థ మౌనం వహించడం ఆరోపణలు నిజమేనేమోననే భావనను మరింత బలపరుస్తోంది. ఆర్ఎస్ఎస్ అనేది అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వెన్నెముకగా నిలుస్తున్న సంస్థ. అలాంటి సంస్థ అంతర్గత సమస్యలపై, ముఖ్యంగా పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలపై నిర్లక్ష్యంగా ఉండటం ఏ మాత్రం సమంజసం కాదు. ఈ మౌనం ఆర్ఎస్ఎస్ లోని వ్యవస్థాగత లోపాలను బహిర్గతం చేస్తోంది. బీజేపీ పాలనలో ఉండి కూడా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించకపోవడం పాలకుల చిత్తశుద్ధిని నేరుగా ప్రశ్నిస్తోంది.